వినిపించకపోయినా విలపించిన గానం మౌనం,
అనిపించకపోయినా అందించిన సందేశం మౌనం..
కనిపించకపోయినా కొలువుండే శక్తి మౌనం,
వివరించకపోయినా విధించిన శిక్ష మౌనం..
ధరించకపోయినా ధరించిన ఆభరణం మౌనం,
పట్టుకోకపోయినా పట్టుకున్న ఆయుధం మౌనం..
చెప్పకపోయినా చెప్పిన సమాధానం మౌనం,
ఒప్పుకోకపోయినా ఒప్పుకున్న అంగీకారం మౌనం..
లిపి లేని భాష మౌనం,
భాషకందని భావం మౌనం...
రాయని కవిత మౌనం,
కవితలకందని కథనం మౌనం...
తిట్టకపోయినా తిట్టిన తిట్టు మౌనం,
కొట్టకపోయినా కొట్టిన దెబ్బ మౌనం...
అడగకపోయినా అడిగిన అనుమానం మౌనం,
చెయ్యకపోయినా చేసిన అవమానం మౌనం...
చూపించలేనంత ప్రేమ మౌనం,
భరించలేనంత బాధ మౌనం...
కోరుకున్నదాన్ని చేరుకోవాలనే ఆరాటం మౌనం,
చేరుకోవాలనే ఆశతో చేసే పోరాటం మౌనం...
వివరాలకందని ఆనందం మౌనం,
విహారాలకందని ఆహ్లాదం మౌనం...
విజయానికైనా మౌనం,
విఫలానికైనా మౌనం..
సమస్యకి కారణం మౌనం,
ఆ సమస్యకి నివారణం మౌనం..
ఆదీ మౌనం,
అంతం మౌనం...
విశ్వం ఆరంభంలో మౌనం,
విశ్వం అంతమయ్యాకా మౌనం...
సమయ సందర్భాన్ని బట్టి వాడితే
అతిపెద్ద అందం ఈ మౌనం...
అవేవీ లేకుండా ఇష్టానుసారం వాడితే
అతిపెద్ద అందవికారం కూడా ఈ మౌనం...