అతివ జన్మ ఓ అపురూపం,
అది తల్లితనముతో పరిపూర్ణం...
అమ్మ అవటమే ఓ అదృష్టం,
ఆ పిలుపు వినటమే ఆనందం...
అది అందమైన చిరుగాలుల హారం,
శుభవార్త విన్న ఆ సాయంకాలం..
కాబోవు అమ్మగా నా పయణం,
మొదలైంది కొత్తగా ఆ పర్వదినం...
అణువంతగ నువు నను చేరావు,
దినదినము పెరుగుతూ మురిపించావు...
ప్రాణాన ప్రాణమై ప్రభవించావు,
ఆనంద కడలినే సృష్టించావు...
నా ప్రాణంలో నువు సగభాగంగా,
సరికొత్త బాధ్యతై జతకలవంగా,
రానున్న కాలమే సౌభాగ్యంగా,
నా కల్లముందరే కనిపించంగా...
ఆహారశైలిలో మార్పులు తెస్తూ,
ఆరోగ్యసూత్రమే అవలంబిస్తూ,
పురాణాలనే శ్రవణం చేస్తూ,
సద్గుణాలనే సముపార్జిస్తూ...
నడకా,నడతలు మార్చేశాను,
నా వంతు బాధ్యతను గుర్తించాను...
ఈ గడిచే రోజుల గతి పెరుగంగా,
నీ కదిలే కదలిక శృతి మారంగా...
నీ కాలిదెబ్బలే నా కానుక లాగా,
నడిరాత్రులు కూడా నను చేరంగా...
నీ ప్రతికదలికనూ ఆశ్వాదిస్తూ,
నీ చిరుదెబ్బలనే ఆనందిస్తూ...
నా ఊహల్లో నీ రూపం గీస్తూ,
నా స్వప్నాల్లో నీ కదలిక చూస్తూ...
ప్రతిక్షణమూ నిను గమనించాను,
కాబోవు అమ్మగా గర్వించాను...
ఆ నవమాసాలు నిండిన రోజున,
నువు నా నయనం ముందుకు చేరు గడియన,
నా గుండెచప్పుల్ల గతులు పెరుగగా,
నా ఎదురుచూపులే ఏడుపవ్వగా...
పురుటి నప్పుల్ల గడియలు రాగా,
ప్రసవ వేదనకి స్వాగతించగా...
చావు బతుకుతో నా పోరాటం,
అది అమ్మతనముకై ఆరాటం...
వేల మరణాల బాధనే అది,
ప్రతి పడతి జన్మకీ పునర్జన్మమే అది...
నీ రోదన నా ఆనందమవ్వగా,
నీ చిరుకదలిక నా చైతన్యమవ్వగా,
నీ ఏడుపు నా చెవుల చేరగా,
నీ చిరుచూపులు నా కనుల తాకగా....
ఈ అతివ అమ్మగా జన్మించింది,
అరుదైన రీతిలో పులకించింది...
పుణ్యాల ఫలితమే అనిపించింది,
ఆనంద సౌధమై ననుతాకింది...
ఆ దినము మొదలు నా అనునిత్యం,
నీ చిరునవ్వులతో సాన్నిత్యం...
నీ సుఖమే నా సర్వస్వంగా,
నీ లాలన లోనే లీనమవ్వగా,
అమ్మనీడలో నువు అపురూపంగా,
నా కల్లముందరే పెరుగుతుండగా...
నీ కన్నీల్లకు నే కలవరపడుతూ,
నీ చిరునవ్వుల చిరునామానౌతూ...
నీ తప్పటడుగులకు తోడుని అవుతూ,
నీ అల్లరి పనులకు అబ్బురపోతూ...
ఈ అమ్మ ప్రేమనే అందించాను…
ఆ ఆనందం లోనే జీవించాను...
నువు మంచితనానికి మారుపేరుగా,
సద్గుణాల ఓ సంచికలాగా...
అందరికీ ఒక ఆదర్శంగా,
విజయానికి ఓ నిదర్శనంగా...
అత్యంత ఎత్తుకే నువు ఎదగాలి..
ఈ అమ్మ దీవెనలు నిజమవ్వాలి...