అనగా అనగా...
(ఫణి డొక్కా) అమ్మలు : డాడీ డాడీ కథ చెప్పు అతను : ఏం బంగారూ, నిద్ర రావటం లేదా? అమ్మలు : అవును డాడీ అతను : సరే, అయితే, యిలాదా... ఆ తలగడా తెచ్చుకుని నా వొళ్ళో బజ్జో... కథ చెబుతాను. అమ్మలు : సరే డాడీ... అతను : అమ్మలుకి ఏం కథ కావాలీ? రాజుగారూ, రాకమారుడూ కథ కావాలా? అబ్బాయి : ఆ 'ఖత' నిన్ననే చెప్పావు డాడీ... అతను : ఆరి పిడుగా! నువ్వుకూడా లేచే వున్నావా? 'చాక్లెట్' కొనలేదని కోపం వచ్చి ఏడింటికే పక్క ఎక్కారుగా అబ్బాయిగారు. కోపం పోయిందా? నిద్ర రావట్లేదా? అబ్బాయి : లేదు... కోపం కోపమే... ఖత... ఖతే.. అతను : సరే అయితే, నువ్వు ఇటు వైపు బజ్జో, ఇవాళ ఆవూ, పులీ కథ చెబుతాను. అబ్బాయి : వద్దంటే వద్దు, ఆ కత అమ్మ ఎప్పుడో చెప్పేసింది అతను : అయితే... దూడా, పులీ కథ వినండి అబ్బాయి : బావుంది, బావుంది చెప్పు డాడీ అమ్మలు : అబ్బా తొందరగా చెప్పు డాడీ... అతను : అనగా అనగా ఒక చిన్న వూరు. ఆ వూర్లో వో చిన్నరైతు. ఆ రైతు దగ్గర ఒక ఆవూ, ఒక దూడా ఉన్నాయి. దూడ మెడలో చిన్న చిన్న గంటలు కట్టి... కాలికేమో మువ్వులు కట్టి, చక్కగా బొట్టు పెట్టి, ముస్తాబు చేసి దానితో ఆడుకునే వారు రైతు పిల్లలు. ఆ దూడ... చూడ్డానికెంత బావుండేదో.. ఆవుకేమో దూడంటే ప్రాణం. ఒక్క నిమిషం దూడ కనపడకపోతే, ఆవుకి చాలా భయం వేసేసేది. దూడ కోసం పొలం గట్టు మీదా, వూరిలోనూ... అన్ని చోట్లా వెతికేసేది. దూడకి పాలివ్వందే ఆవు ఏమీ తినేది కూడా కాదు. అబ్బాయి : మరి పులి ఖత అన్నావు? అతను : తొందరపడకూ, పులి కూడా వుంది కథలో అమ్మలు : పులి అడవిలో వుంటుంది, కదూ డాడీ? అతను : కరక్ట్ అమ్మలూ... గుడ్ గర్ల్... సరే ఇక వినండి. ఆ వూరిని ఆనుకొని ఒక పెద్ద అడవి. ఆ అడవిలో బోల్డన్ని జంతువులు. ఒక పులి కూడా అది... ఏం చేసేదీ? ఆహారం కోసం, ఒక్కోసారి అడవి చివరికి వచ్చేసేది. వచ్చీ... పొలం గట్లమీద మేసే మేకల్నీ, గొర్రెల్నీ తీసుకువెళ్ళి అడవిలో తినేసేది. అందుకనే, ఆవుకి అడవంటే చాలా భయం. రోజూ దూడకి చెప్పేదీ... ఎప్పుడూ మిగతా దూడలతో కలిసి వుండు. అడవి దగ్గరికి కూడా వెళ్ళకూ అని. కానీ దూడకి చాలా సరదాగా వుండేది. అడవిలో యేముందో చూడాలని. దానికి తోడు, రెండు మూడు మచ్చల దూడలుండేవి మందలో. అవి అప్పుడప్పుడూ వచ్చి చెబుతూ వుండేవి. అడవి యెంతో బావుంటుందనీ, అడవిలో... కావలసినంత ఆహారం వుందనీ, అవి మిగతా దూడలకి తెలియకుండా ఒకటి, రెండు సార్లు అడవిలోకి వెళ్ళివచ్చాయి. అందుకే గొప్పలు చెప్పేవి. అమ్మలు : మరీ... పులి వాటిని తినేయలేదా డాడీ? అతను : లేదు బంగారూ.... పులి కూడా మంచిదే, కానీ ఆకలేస్తే మాత్రం ఎదురుగా ఏముంటే దాన్ని తినేస్తుంది. సరే. ఒక రోజు దూడ ఎవరికీ చెప్పకుండా అడవి వైపు వెళ్ళింది. కొంచెం బయం వేసింది. అయినా సరే... ఇవాళ ఎలాగైనా అడవిని చూడాలి... అని పట్టుబట్టి, మెల్లిగా అడవిలోకి వెళ్ళిపోయింది. అమ్మలు : అమ్మో! అతను : ఆ! ఇంతలో సాయంత్రమై పోయింది. దూడ అడవిలో బోలెడంత ఆహారం చూసింది. కడుపునిండా, హాయిగా మేసింది. రకరకాల జంతువుల్ని చూసింది. తనలాంటి దూడల్ని కూడా చూసింది. కాని అవేవీ అంత స్నేహంగా మాట్లాడలేదు. దేని తిండి గొడవలో అది, అలా తిరుగుతున్నాయి. ఇంతలో పులి గాండ్రింపు వినిపించింది. గజగజా వణికిపోయింది దూడ. ఢామ్మని ఎక్కడి నుంచో దూకింది పులి. దూడని చూసి అడవికెందుకొచ్చావ్? అంది ఇక్కడ బోల్డంత ఆహారం వుందనీ, బోల్డన్ని జంతువులు కూడా వున్నాయనీ మా నేస్తాలు చెబితే, చూద్దామని వచ్చాను అంది దూడ వణికిపోతూ.. పులి సరే, ఈ అడవి నియమం చెబుతాను విను. ఇక్కడ నీలాగా బోలెడన్ని దూడలున్నాయి. నాలాగా బోలెడన్ని పులులూ వున్నాయి. మా సింహం రాజుగారు అన్ని జంతువుల్నీ రానిస్తారు తన రాజ్యంలోకి, కాని ఒకసారి వచ్చిన జంతువు, కొన్నేళ్ళ వరకూ వెనక్కి వెళ్ళడానికి వీలులేదు. వెళ్ళాలని ప్రయత్నిస్తే, ఆయన, ఆ జంతువుని తినేస్తారు. ఇక్కడ స్వేచ్ఛగా బ్రతుకు, కానీ, ఆకలేసి నప్పుడు నాలాంటి పులి కంటపడ్డావో, నీ పని కాస్తా, ఢాం. కాబట్టి తెలివిగా, మెలకువతో బతకటం నేర్చుకో. అర్థం అయిందా? అంది. దూడ, అయ్యో, నేను వెనక్కి వెళ్లిపోవాలండీ, నన్ను చూడకపోతే మా అమ్మ ఏమీ తినదు. పాపం, ఏడుస్తుంది కూడా. అందుకే నేను వెళ్ళిపోతానండీ అంది పులి. ఇలాంటి వేషాలేస్తే నిన్ను ఇప్పుడే తినేస్తా. జాగ్రత్త! బుద్ధిగా అడవిలోకి పోయి స్వేచ్చగా బతుకు, ఫో అని దూడని అడవిలోకి తరిమేసి వెళ్ళిపోయింది. దూడ అడవిలో వుండిపోయింది. భయపడుతూ భయపడుతూ బతకటం నేర్చుకుంది. పులి నుంచీ, సింహా రాజు గారినించీ, తెలివిగా తప్పించుకోవడం తెలుసుకుంది. కొన్నాళ్ళకి ఆ భయం, అడవీ అలవాటైపోయింది. కొన్నేళ్ళు గడిచి పోయాయి. పాపం... ఆవు రోజూ అడవి సరిహద్దు దగ్గరకొచ్చి దూడని పిలిచేది. ఎంతో సేపు ఏడ్చి, ఏడ్చి, అలిసి వెనక్కి వెళ్ళిపోయేది. కానీ దూడ రాలేదు. ఇప్పుడు దూడ కూడా పెద్ద ఆవు అయిపోయింది. దానికీ ఓ చిన్న దూడ. ఒకసారి చిన్న దూడ అడిగింది - అమ్మా మనం ఎవరం? ఎందుకిలా, రోజూ భయం భయంగా బతుకుతున్నామూ? అని. అప్పుడు గుర్తొచ్చింది దూడకి, తన గడువు తీరిపోయిందనీ, తను వెనక్కి వెళ్ళిపోవచ్చుననీ. అంతలోనే యేదో అనుమానం... తను వెనక్కి వెళితే తనకీ, తన దూడకీ అక్కడ ఆహారం దొరుకుతుందో? లేదో? ఇన్నాళ్ళూ అడవిలో పెరిగిన పిల్లదూడ, వూరిలో బతకగలదా? తన దూడకి ఏమైనా అయితే? అమ్మో... ఇలా ఆలోచనలో పడిపోయింది ఒకప్పటి దూడ... ఆమె : శీను గారండీ! పిల్లలు పడుకుని అరగంట అయింది. కథ ఎవరికి చెబుతున్నారండీ? అయినా పిల్లల కెవరేనా ఇలాంటి కథలు చెప్తారా? పాపం... దడుసుకోరూ? అతను : లేదు కన్నా, వాళ్ళకి యే కథైనా మొదట్లోనే తెలుసు. కథ కొంచెం అవగానే నిద్రపోతారు వాళ్ళు. అందుకే, వాళ్ళకి ఏ కథ చెప్పినా దడుసుకోరు అంటూ మెల్లిగా వాళ్ళ గదిలోకి నడిచాడు. వెనకాలే ఆమె. అతను కాసేపు అలాగే కూర్చుండిపోయాడు. తరువాత ఆమె మెల్లిగా అతని వొడిలోకి చేరింది. ఆమె : ఏమండీ, ఆ దూడ వెనక్కి వెళ్ళిందా? అంది తల పెకెత్తి అతని కళ్ళలోకి చూస్తూ. అతను : తెలియదు కన్నా. కొన్ని కథలకి ముగింపు వుండదు. వున్నా మనకి తెలియదు. ఆమె : లేదండీ... ఈ కథ మీరే మొదలు పెట్టారు, కనక మీరే పూర్తిచెయ్యాలి, పూర్తిచెయ్యండి శ్రీనూగారూ... ప్లీజండీ... అంది గోముగా, చిన్నపిల్లలా. అతను : మ్....సరే అయితే, ఆ దూడ వెనక్కి వెళ్ళి హాయిగా జీవితం గడిపేసింది, తన దూడతో. మళ్ళీ ఇంకెప్పుడూ అడవి వైపు కూడా చూడలేదు. ఆమె : మా శ్రీవారు మంచివారు అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది... అతను : జీవితం కథ అయితే ఎంత బావుంటుందో... కదూ.... కన్నా? అడిగాడు అతను, ఆమె తల నిమురుతూ.