Articles - Chadaramgam




Name: Admin

Published Date: 10-03-2016


చదరంగం

పూర్వం భారతదేశం రెండు రాజ్యాలుగా ఉండేదట. రెండు రాజ్యాలకూ ఇద్దరు రాజులు. ఉత్తర భారతాన్ని ఒకరూ, దక్షిణ భారతాన్ని మరొకరూ పాలించేవారు. గుణ సంపన్నులయిన ఆ రాజులు ఇద్దరూ కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకొనేవారు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు; ఇద్దరి అభిరుచులు కూడా దాదాపు ఒకేలా ఉండేవి. కానీ వారికో తీరని లోటు- ఇద్దరికీ విపరీతమైన యుద్ధ కాంక్ష ఉండేది- కానీ రక్తపాతమంటే అయిష్టం! మరెలా? అందుకని వాళ్లు ఆ కోరికను ఎలాగోలా నిగ్రహించిపెట్టారు.
కాలం గడిచింది. రాజులిద్దరూ ముసలివాళ్లయ్యారు. ఇక రాజ్యపు బాధ్యతల్ని తమ వారసులకు అప్పగించి, కొంత కాలం పాటు అడవుల్లో గడపాలని నిశ్చయించుకున్నారు.
అనుకున్నదే తడవు పనులన్నీ చకచకా జరిగిపోయాయి. వారసులకు పట్టంకట్టి, అడవులకి వెళ్ళి, ఇద్దరూ హరినామ జపం మొదలుపెట్టారు. జపం నియమ నిష్ఠలతో చాలా కాలం కొనసాగింది. ఇక ఆ శ్రీహరికి ప్రత్యక్షం అవ్వక తప్పలేదు. వాళ్లిద్దరిముందూ నిలబడి`ఏం కావాలో కోరుకొమ్మ’న్నాడు స్వామి. రాజులిద్దరూ తమ కోరికను చెప్పుకున్నారు: ’మేము నిరంతరంగా యుద్ధం చేసుకోవాలనుకుంటున్నాం. కానీ మా యుద్ధం వల్ల ఎటువంటి వినాశనమూ జరగకూడదు’ అని కూడా విన్నవించుకున్నారు. `సరే’నన్నాడు చిద్విలాసమూర్తి శ్రీహరి. “ఇక మీదట మీరిద్దరూ, మీ పరివారం కొందరూ- నిరంతరం యుద్ధం చేసుకోండి; ఎలాంటి రక్తపాతాలూ చోటుచేసుకోవు. మీ ఈ పోరు మీకేకాక, అనేకులకు సత్కాలక్షేపమై, లోకరంజకమై శోభిల్లగలదు” అని, హరి అంతర్థానమయ్యాడు. ఉత్తరం రాజు ఒకవైపున, దక్షిణం రాజు మరొకవైపున తమ సైన్యాలను మోహరింపజేసుకొని యుద్ధం మొదలుపెట్టారు.
ఎండలెక్కువైన దక్షిణ భారతంలో ఉండీ ఉండి కొందరు నల్లగా అయితే, ఉత్తరాన నదీ తీరాల్లోను, చల్లని ప్రదేశాల్లోను ఉండి కొందరు తెల్లబడ్డారు..

Use-Center-Control-to-Improve-Your-Chess-Game-Step-4

అలా మొదలైందన్నమాట, చదరంగం ఆట! రాజులిద్దరి ఈ యుద్ధం నిజంగానే రక్తపాతరహితం, జనరంజకం- వేసవి శలవల్లో సత్కాలక్షేపం, మీ మెదడుకు మంచి మేత కూడా. ఒక్క దెబ్బకే చాలా పిట్టలు. కొట్టండి మరి! మీకు చదరంగం ఆడటం రాకపోతే, వచ్చిన వాళ్ళనడిగి నేర్చుకోండి!




Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.