Articles - Chaduvu Samskaram




Name: Admin

Published Date: 05-04-2016


చదువూ సంస్కారం

(ఛాయరాజ్) నెలదినాలుగా ఆకాశం మబ్బులతో నిండి ఉంది. చినుకు రాలడంలేదు. రాత్రి 8 గంటల సమయం. 'రామ నా సెందునాలో... రాజా నీకొందనాలో...' రాములమ్మ పాడుతోంటే, ఆమె చుట్టూ తిరిగి వలయంగా గెంతులేస్తున్నారు గుంటలు నలుగురూ. పెద్ద కొడుకు ఆశ్చర్యార్థక (!) మంత ఉంటాడు. రెండవ వాడు ప్రశ్నార్థక (?) మంత ఉంటాడు. నడిపోడు కామా (,) లాగుంటే, చివరారకరి గుంట పులిస్టాపు (.) లాగుంటుంది. ఒక వాక్యానికి ఇన్ని గుర్తులు పెడితే, దానర్థం ఒకంతట అవగతం గాదు పండితులకు గూడా... ఏమైనా అర్థమైతే శ్రీశ్రీ లాంటి వారికే అర్థమవ్వాలా. తాపీ పని ముగించుకొని, మేస్తిరివాటాపోనూ మిగిలిన కూలీ డబ్బులు జేబులేసుకుని, గుడిశవేపు వస్తున్నాడు సీతప్పడు. గుడిశ ముందు వాకిట్లో ఈ గెంతులు చూసి వల్లు మండిందాతడికి. 'తాపీ'తోటి వాళ్ళ చెంపల మీద ఒక్కొక్కటిచ్చుకోవాలనుకొని - 'ఓలె రావుడో... ఏమిటాగెంతులు? నువ్వు చెడిందిగాక గుంటలికి నేర్పుతున్నావు యిద్దెలు. ఈ పొద్దామాసైతే, మేగాలతోటి ఆకాసం ఒరిసిపోయి నల్లగైపోయుంటే... యెన్నెలట... యెన్నెల... పాటలు మాటకేంగాని, కడుపు మండతంది... కూడొండినావా లేదా?' అన్నాడు సీతప్పడు. 'ఓసి... పల్లకోవా... కూలికెళ్ళి ఈ పొద్దు పెందరేల గుడిశ కొచ్చీసినాను. దార్లో సెట్టికొట్లో ముతక (దొడ్డ) బియ్యం 30 రూపాయల చొప్పున రెండు కేజీలు కొనుక్కొచ్చి ఉడకేసినాను. కూర తెస్తావని చూసిచూసి, కడుపుమండి, గంటలూ నీనూ, కూడి ఆకలి పోగొట్టుకోడానికిలాగ గెంతతున్నాం. అమాసైతే... యెన్నిలొచ్చిందాక, పాట ఆగుతాదేటి?, శాన, శాన... అవును కూలిడబ్బుల్తోటి తాగీసినావేటి? అలాగ సిరసిరలాడతన్నావూ... సేతిలో తాపీ తప్ప ఏటిలేదు... ఎలాగనీతోటి...' అంది రాములమ్మ. 'గుంటల్లారా, రాండి రండర్రా...' అంటూ గుడిశలోనికెళ్ళింది. పిల్లల్లు తల్లెనక తుర్రున గుడిశలోకి పోయి, బితుకు బితుకుమని, యిరకిరకల్లోంచి అయ్యని చూస్తున్నారు బెంబేలెత్తిపోయి. ఉట్టిమీద ఉన్న సట్టిలోంచి గుప్పిడు నెత్తడి పరిగల్ని తీసి, కడిగి, మూకిడిలో సిటికెడు నూనె పోసి - అందులో వేసి పొయ్యిమీద పెట్టి, నిప్పూదింది రాములమ్మ. కూరొండలేదని అగ్గిబరాటా అయిపోతుండు సీతప్పడు. 'ఉండండి, 'ఇందిరమ్మ ఇల్లు'లోని కెలితే, అక్కడ గెంతుదురుగాని...' అంటూ పిల్లలవేపు ఉరిమిచూశాడు ఇంట్లో... ఒంట్లో బాగోలేని తాపీపనోడు.

ఆ మాటల్ని రాములమ్మ అందుకుని 'ఆగు ఆగు... ఆ, ఇందిరమ్మ ఇంట్లో నువ్వుండు. మీం రాము. ఆ యిల్లుకేటి? భూముంటుందా? ఆకాశముంటుందా? స్నానానికి గది (చాటు) ఉంటుందా?... చేతులు కడుక్కోవడానికి నీరుండదు... నువ్వు సారాయి సుక్కయినా ఇంటికి దెస్తావా... అక్కడే పేగులో బోసీసుకుని చేతులు దులిపీసుకోని, దరజాగా పారొస్తావు... నీకేటి? మగమహారాజువి?' అంది. 'ఓలోలె... రావుడూ... నీకీయేల ఏటి పట్టుకుందే... నేను తాగినానంతన్నావు, మూజూసి (మూతివాసన జూసి) చెప్మీ... నువ్వు గాని తాగీసినావేటియ్యేలా... లేకపోతే, ఇందిరమ్మ ఇల్లొస్తే ఎల్లనంతావేటి? 30 వేలిచ్చి గవర్నమెంటు కట్టించి, ఒట్టిగ పిలిచిస్తే కాలదన్నతన్నావేటే... చెప్మీ' అడిగాడు సీతప్పడు. 'ఎల్లనన్నాను గాని, ఒగిలేస్తానన్నానేటి? ఆ యిల్లు కూలిపోయి అందులో సమాదైపొమ్మంతావేటి?... అల్లాడు, సరుకులిచ్చే సావుకారు అడుగతున్నాడు... ఆ ముప్పయివేలు గాదు గాని 20 వేలు ఇచ్చేస్తాను... గ్రామపెద్దల దగ్గర నోటుమీద సంతకమెట్టీమంతన్నడు. ఆ డబ్బులు తీసికొని, చిన్న గుంటకి ముక్కూ చెవులూ కుట్టిద్దుం... దానికి రేపొద్దన్న మొగుడు రావాలా? మగ్గుంటలకి మొలతాడైనా లేదు. ఈ నలుగురుగుంటలకీ సదువులు చెప్పించాలా?... నీకూలీ, నా కూలీ డబ్బుల్తోటి కడుపులే నిండడం లేదు' అంది. మూకుడిలో తాలింపేస్తూ, చిటపటల మధ్య... పొయ్యిలో అగ్గిరాజేస్తూ... 'ఓల్నీయమ్మ కడుపుమాడా, ఇందిరమ్మలాగా ఎంత ఎమర్జన్సీగా ప్లాన్లు అల్లీసినావే...ఆఁ...' ఆశ్చర్యపోయాడు సీతప్పడు. 'శాన, శాన... పెద్దోడికి వంద, రెండోవాడికి 80, నడిపోడికి 70 కడతుంటే సరిపోతుంది... బొక్కలెట్టేస్తారని ప్రయివేటు బడిలో జాయినుచేస్సీనావు. మిగిలిన పనులెలాగ జరగతాయి? ఇంకా... ఈ చిన్నిగుంటను బడిలో ఎయ్యాలా? వద్దా?..' అంది రాములమ్మ. 'అటు ఇంగిలీసూ రాక, ఇటు తెలుగు ముక్కలు రాకా, మద్దిన సెడగొట్టినావు గుంటల్ని' అని గొణుక్కుంటున్న రాములమ్మనుద్దేశించి-'నీ తెలివి మండా, సర్కారు బడిలోకంటే, ప్రయివేటు బడిలో సదువుబాగుంటదనే గదా చేర్చినాం...' 'బాగుంటదని ఎవులు చెప్పినారు' 'ప్రైయివేటుబడి నడుపుతున్న సావుకారి..' 'సదువులు బేరమైపోయినాయన్నమాట... ఆ మాట సర్కారు మేస్టర్లు ఎక్కడైనా అన్నారా? ఆ మాట...' రాములమ్మ 'ఆలు... ఏది చెప్పరు...చెబితే మనకెందుకూ ఈగతి..' సీతప్పడు. 'సుబ్బరగ గుంటల్ని గవిరిమెంటుబడిలో చేర్చీద్దాం. నాలుగు తెలుగు ముక్కలైనా నేర్చుకుంతరు. అదీగాక 'మధ్యాహ్న భోజనం' ఇంత పప్పన్నమైనా పెట్టి... ఆ పూట గడుపుతారు' అంది రాములమ్మ. పకపకా నవ్వాడు సీతప్పడు... 'పప్పు... పప్పా... ఎవరెడతారు. కందిపప్పు 100, మినపప్పు 90, పెసర గిసరా 80 దాటి రేట్లున్నాయి. వంటమనుసలకు జీతాలమాటటుంచి... బిల్లులే చెల్లించరట. చింతపిక్క 50. చారైనా పోయ్యిలేరు. ఆ గంజి మనం పోసుకోలేమేటి? మన పిల్లలకి...' అన్నాడు. ఈలోగా, పక్క గుడిశలో మోగుతున్న టీవీ దగ్గరకు జారుకున్నారు గుంటలు నలుగురూ. 'పల్లకో... చానా... చెప్పినావు. లోకమంతా ఒక తీరైతే... నీదొక తీరు...' అంది రాములమ్మ.

ఇంతలో - పెద్ద గుంటడు గుడిశలోకి పరుగెత్తుకొచ్చి 'ఓలమ్మా... ఓరయ్యో...ప్రయివేటు బడులన్నీ మూసీసినారంట. అదేదో 'గురితింపు' ఇవ్వలేదట. మా బడీ రేపటినుండి మూసేస్తారు గావాలా... అంటూ వాకిట్లోకి పారిపోయాడు. గుంటలందరూ వీధుల్లో చేరి గెంతుతున్నారు. ఈ చోద్యం చూద్దామని... పొయ్యి ఆర్పేసి... వాకిట్లోకొచ్చింది రాములమ్మ. పిల్లల మధ్యకెల్లి నిలబడి తానూ గెంతడం ఆరంభించింది. రాములమ్మా గుంటే. పాతికేళ్లయినా నిండలేదు అనుకున్నాడు సీతప్పడు. ' రాములమ్మ పాటందుకుంది 'రామనా సెందునాలో.. రాజా నీకొందనాలో.. 'అ ఆలు నేర్పుతాది యెన్నెలో ఎన్నెలా' ఇ ఈలు నేర్పుతాది యెన్నలో ఎన్నెలా కలిపివేత నేర్పుతాది యెన్నలో ఎన్నిలా తీసి వేతలు నేర్పుతాది యెన్నెలో ఎన్నిలా 'క' గుణింతం నేర్పుతాది.. ఎక్కాలు నేర్పుతాది... గుణింతాలు నేర్చుకుంటాం బాగారం నేర్చుకుంటాం' ఇన్నాళ్ళబట్టి డబ్బుగట్టి, ప్రయివేటు బడిలో చేర్పిస్తే... ఒక్క ఇంగ్లీషు ముక్క పాటలో పలకరేటి గుంటలూ... అన్నన్నా... తల్లిబాస అంత గొప్పదేటి? అలాగంటున్నాది గుంటల నాలిక! అనుకున్నాడు. సీతప్పడు... ఆలోచనలో పడిపోయాడు.ప్రయివేటు స్కూల్లు మూసీసినారని విని, అందులో తన పిల్లలు చదువుతున్నారని తెలిసీ - చీకట్లో గుంటలతో కలిసి - వీధిలో యెన్నెల పాటలు పాడీ... పాడించీ గెంతుతాదేటీ యాడది? అర్థంకాలేదు సీతప్పడుకి. సిన్నప్పుడు పెల్లాడీసినాను - ఈ ఆడదీ గుంటల్లో గుంటేగదా అనుకుని చిన్నగా నవ్వుకున్నాడే గానీ - మళ్ళా మనసుదిరిగి - ఈ రాములమ్మ గుంటముండకి మొగుడి ధ్యాసేలేదేమిటి? అనుకుంటూ నాలుక్కరుసుకొని - అది ముండయితే నా చావే గదా! అని గుండెలు బాదుకున్నాడు. 'ఆడదంటే మాజాకా! మొగుడు లేకపోతేటి? 'ఆది'శక్తి! ఆదినుండీ అదీ పనిచేస్తుంది, సంపాదిస్తుంది. పిల్లలు తల్లివెనుకే బడతారు. నాయెనక ఇసుమంత ఆస్తిలేదు.. నేను బెట్టుపోవడానికి. ఏదిఏమైనా నీనూ దానెనకే బడాల... అంచేత, అది చెప్పిన మాటల్లోని గుణానికి విలువివ్వాలా అనుకుంటూ వాటిక్లో కొచ్చిన సీతప్పుడు 'రామనా సెందునాలో... పాటందుకున్నాడు. పాట, ఊరుకుంటాదేటి? పాదాల్ని కదిపిస్తది. పాదాలు కదిల్తే - శరీరం ఊరకుంటాదేటి? డాన్సు మొదలయ్యింది. రాములమ్మ సీతప్పడి చెయ్యి అందుకుంది. వీదిలో పిల్లలందరూ వారిద్దరి చుట్టూ వలయంగా, లయబద్ధంగా ఆడుతున్నారు. కష్టమనండీ, శ్రమనండీ - అదొకరకమైన అందమై, ఆనందమై, అన్నింటికీ మించిన సౌందర్యమై, బహిరంగంగా రూపుకట్టింది. ఈ సౌందర్యం ముందు చీకటెంత? వెన్నెలెంత? శ్రమ హృదయీకరించబడినప్పుడు, సమాజం కళాత్మకమై, కొత్తలోకావిష్కరణకు, తలుపులులేని ద్వారంబంధమవుతుంది.' కూర ఉడకకముందే కడుపులు నిండిపోయాయి. పిల్లలు మాత్రం కడుపునిండా తిని గడపలో నిద్రపోయారు. రాములమ్మా గుంటేగదా... తాడిరేకుల చాపమీద వెల్లికిలా చారబడి, ఆవులించి, కనురెప్పల్ని మధురంగా వాల్చింది. దీపం బుడ్డి వెలుతురులో రాములమ్మ కుప్పపోసిన అందంలా ఉంది. సౌందర్యమంటే - ఆడదే అనుకున్నాడు. ఆమెపై చెయ్యివెయ్యడానికి జంకాడు. తాకితే కాలిపోతానేమోనని భయపడ్డాడు. అందం ప్రజర్విల్లినప్పుడు, అనుభవం కళ్ళు మూసుకుకోవాలేమో! ఆమెపక్కనే చారబడి ఉన్న సీతప్పడు మెల్లగా లేచి, గట్టిగా ఊది దీపం బుడ్డీని ఆర్పేసాడు. చీకటిలో చీకటిని చూస్తే, అనాధిగా అలిసిపోయిన కళ్ళు నిద్రలోకి దుమికి - ప్రశాంతంగా, తియ్యగా కాలాన్ని గుటకేశాయి.ఇంతకూ - విషయమేమిటంటే, రాములమ్మ తల్లితండ్రులూ నిరుపేదలే. వీధిబడిలోనే ప్రాథమిక విద్య నేర్చుకుంది. ఎప్పుడు పెద్దపిల్లయితే (సంవర్తాడితే) అప్పుడు చదువు మాన్పించేద్దాంలే అని, ఆ పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలో చేర్చారు. ఏడవ తరగతి కొచ్చింది సంవర్తాడలేదు. 8, 9 10లోకి వచ్చింది. ఇంకా లేదు! 10వ తరగతి 'ఫస్టుక్లాసు'లో 90 శాతం మార్కులతో పాసయ్యింది. ప్రజలు మెచ్చుకోలేదు సరిగదా, గుంట గడసరి, స్లిప్పులు బాగా అందించి ఉంటారు కావలసిన అబ్బాయిలు. చూసిరాసి పాసైపోయిందని అన్నారు. పోనీ, పాసుమాటకేం గానీ ... శరీరాన్ని బిగబెట్టీసిందేంటో.... ఇంకా సంవర్తాడలేదు గుంటన్నారు. ఈ లోగా ఆ - ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీగా 'అప్ గ్రేడ'యింది. ఇంటర్ లో చేరిన రాములమ్మకు 16! ప్చ్... కాలేదు. 17లోకి వచ్చింది. ఇంటర్ రెండోసంవత్సరం పరీక్షల్లో 80 శాతం మార్కులతో ఫస్టుక్లాసులో పాసయినట్టు తెలిసిన క్షణంలోనే 'కూర్చుంది' (పెద్దమనిషయ్యింది). నారాయణ వాళ్లొచ్చారు, చైతన్యవాళ్లొచ్చినా గవర్నమెంటు జూనియర్ కాలేజీలోనే చదివింది. ఇప్పుడు అవేవో కాన్సెప్టు కాలేజీలొచ్చాయి ఎత్తుకుపోవడానికొచ్చారు కోచింగులకని. రాములమ్మ తల్లితండ్రులు భయపడ్డారు. పెళ్ళి సంబంధాలు చూశారు. అసలే వెనుకబడిన కులస్తులు. ఇంతో అంతో కలిగి ఉన్న కుటుంబంలోని సీతప్పడుతో ముడెట్టీసినారు. ఈ పిల్ల తెలివితేటలయినదేగాని, పెంకిదిగాదని ప్రజలకే గాదు - తల్లితండ్రులకీ అర్థమయ్యింది. తాహతుమించి ఆలోచించకుండా, పరిస్థితుల మధ్య నిలబడి, వయసొచ్చినాక జీవితం అన్నింటికన్నా ముఖ్యమని భావించిందేమో, పెద్ద చదువులు లేకపోతే, జ్ఞానముండదాయేటని - సీతప్పడి చేత ముడెట్టించుకుంది రాములమ్మ. ఇంత చదువుకున్నా, వ్యాకరణం తెలిసినా - తల్లిబాసను మరచిపోవడానికి ఇష్టపడలేదు రాములమ్మ. తెలుగులోనే ఆలోచించిందంతా. సుఖపడ్డప్పుడు తెలుగులోనే నవ్వుకుంది. కష్టపడ్డప్పుడు ఏడ్వడానికి ఇష్టపడలేదు తెలుగులోనే ఆలోచించి గట్టెక్కడం నేర్చుకుంది. తెలుగులోనే ముద్దు ముద్దు పిల్లల్ని కన్నది. వారికి స్వంత ఆస్తి ఇవ్వలేకపోయినా... భర్తను మర్యాదగా మందలించడం తప్ప తూలనాడడానికి ఇష్టపడదు. మొగుడు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, ప్రకృతిసిద్ధంగా, మర్మం లేకుండా ఉంటాడు... అదే చాలనుకుంటుంది ఆమె. ఇలాంటి 'ఆమె' కన్నా మరియే యితరేతర 'ఆమె'లు - ఎంత చదివినా, ఎంత కలిగి ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా గొప్పవారు కాలేరేమో అనిపిస్తుంది. మరి సీతప్పడో - వీధి బడిలో 5వ తరగతి చదువుకున్నాడు. ఇంటి పరిస్థితులను చూసి శ్రమపడి సంపాదించి కుటుంబానికి తోడ్పడాలనుకునేవాడేమో! ఆ ఊళ్ళోనే ఉన్న ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరాడు. ప్రాథమిక పాఠశాలలో వచ్చిన అనుమానాలు ఇక్కడా తీరనందుకు విసుక్కునేవాడు. తెలుగు నేర్చుకోవడం సుళువు అని భావించలేదుగాని నేర్చుకోవడం 'అందం'గా అనిపించిందేమో, సరదాగా చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించి వాడుకభాషలోకి అన్వయించుకొని, అసలు విషయాలు తెలుసుకొని ఆనందించేవాడు. లెక్కలుతోనే చిక్కంతా - ఒకటికి ఒకటి కలిపితే... ఎంత జెప్పినా రెండనిపించేది కాదు... ఒకటే అనిపించేది. ఒకటిలో ఒకటి తీసీమంటే... తీసీడమేటని ప్రశ్న. ఒకటిలో రెండు తీసీమనడమేంటని చికాకుపడేవాడు. గుణింతాలు అసలు నచ్చేవికావు... ఆ హెచ్చువేతలేంటని ఆశ్చర్యం! అంకెల్లో స్థానవిలువలు గుర్తించవచ్చునుగాని... 100లో 1 వందైపోడమేంటో? పోనీ 1000లో ఒక సున్నా 1, రెండవ సున్నా 10, మూడవ సున్నా వందవ స్థానావిలువల్లో అంత తేడారావడం ఇష్టముండేది కాదు. పాఠశాలకు లేటుగా వస్తే దెబ్బలేంటని 1-2 రోజులు మానేసి, కూలిపనికెళ్ళి దెబ్బలుకు బదులుగా 'డబ్బులు' తెచ్చుకొనేవాడు. 3వ రోజు స్కూలుకెల్తే మరి రావొద్దు పొమ్మనేవారు

ఇంత సుళువైనది, మరొకటి ఉండదని, ఏకంగా బడి ఎగ్గొట్టేసి, గ్యాంగు కూలీల్లోజేరి, క్రమంగా ఇళ్ళనిర్మాణ పనుల్లో చొరబడి తాపీ పరికరం తిప్పడం నేర్చుకొని ఎక్కువ కూలిడబ్బులు తెచ్చి తల్లి చేతిలో పెట్టేవాడు. చదువూ - సంపాదనకే గాదా! అది లేకుండా నైపుణ్యం సంపాదించుకుని, అంతస్తులే కట్టి - ఆ మేడ నేను కట్టిందే, ఈ 5 అంతస్తులు నేను కట్టిందే అని చెబుతుంటే... వీడిదగ్గర ఏ ఇంజనీరు పనికొస్తాడని పిస్తాది... అలాంటి నిపుణుడైనందునే, బాగా (ఇంటరు) చదువుకున్న రాములమ్మను పెళ్లిచేసుకోవడానికి భయపడలేదు. చదువెందుకూ... సత్యాన్ని తెలుసుకోవడానికీ, అందులోని సౌందర్యాన్ని గుర్తించడానికీ, ఆ సౌందర్య నిర్మాణంలోని సొగసుల్ని అనుభవించడానిక గదా చదువు.... అనిపిస్తుంది. సీతప్పడును అర్థం చేసుకుంటున్నప్పుడు. ఉదయం ఇంకా ఎనిమిది కాలేదు. ఆ వాడలోకి టీవీల వాళ్ళు - సకల షూటింగు సరంజామాతో వచ్చిపడ్డారు. 'ఉదయం పనుల్లో' మునిగివున్న కుటుంబాల వాళ్ళు వీధినప్డడారు. టీవీ చానళ్ళవాళ్ళు ఏదో చెప్పి... ఆ విషయంపై మాట్లాడమని, వీధిలోకొచ్చిన ఆడామగా వెంటబడుతుంటే, సిగ్గుబడి, భయపడి గుడిశల్లో దూరిపోతున్నారు. ఇలాక్కాదని... కొందరు... రాములమ్మ దగ్గరకెళ్ళి, బతిమిలాడి ఆమెను టీవీ వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి నిలబెట్టారు. ఆమె మూతి దగ్గర 10 'మౌతులు' పెట్టి- 'ఈ పట్ట

Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.