దీపావళి పోటీ
అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది.
ఒక సంవత్సరం దీపావళి పండుగ దెగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వెయ్యించారు.
రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుకున్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పరియటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు.
ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూశి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు.
ఇంటి దెగ్గిరకు వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారి లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది.
ఇది చూశిన రాజుగారు, “అవ్వ, నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు.
“నా దెగ్గిర రోజు ఒక్క దీపం పెట్టే అంత దబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను” అని చెప్పింది.
జవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు.
మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు.