Articles - Dhorababu Dhurdharshini




Name: Admin

Published Date: 05-04-2016


దొరబాబు దూరదర్శిని

వెర్రి వేయి విధానాలని అంటారు. అలాంటి నానుడి మా దొరబాబు లాంటి వాళ్లను చూసే పుట్టి వుంటుందన్న దానిలో అనుమానం లేదు. కొందరికి తిండి పిచ్చి, కొందరికి తాగుడు పిచ్చి.ఇలాఎన్నో రకాల మనుషులను చూశాను కాని దొరబాబుకున్న వింత అలవాటున్న వాళ్ళని మాత్రం ఎక్కడాచూడలేదు. అలా అని మా వాడికి ఏదో దురలవాటుందనుకునేరు. వాడి కున్నది అబ్జర్వేషన్ పిచ్చి. అంటే అన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి వాటి గురించి తెలుసుకుని తరించే అలవాటనికాదు. అతనికున్న పిచ్చి రకరాకల దినాలను పాటించడం. అంటే మదర్స్ డే, ఫాదర్స్ డే, వేలంటైన్స్ డే లాంటి చాలా మంది పాటించే లేదా జరుపుకునే పాపులర్ రోజులతో పాటు ఎక్కడెక్కడినుంచో తెలుసుకుని రకరాకల దినోత్సవాలూ, వారోత్సవాలూ, మాసోత్సవాలూ చేస్తుంటాడు. అయితే తమాషా అయిన విషయమేమిటంటే, అతను చేసే ఈ కాల మాసోత్సవాల్లో ఒక లాజిక్కంటూ కనపడి చావదు. ఉదాహరణకి, జనవరి హాట్ టీ మంత్ మరియు ఓట్ మీల్ అని ఆ నెల పొడుగునా వాటిని త్రాగుతూ, తింటూ, వాటి ప్రాశస్త్యాన్ని అందరికీ వివరించడమే కాక ఆఫీసులో ఉన్న వాళ్ళకి మసాలా టీ, ఓట్ మీల్ కుకీస్ లాంటివి పంచి పెడుతూ గడిపిన మనిషి. మార్చి నాల్గవ వారం వచ్చేసరికి అమెరికన్ చాకొలెట్ వీక్ అని చెప్పి పొలో మని చాక్లెట్లు తింటాడు. జూన్ లో తాజా పండ్లూ, కూరగాయలు తినాలన్న మనిషి. జూలై అంతా ఐస్ క్రీం మాసోత్సవం చేస్తాడు. ఇక అక్టోబర్ లో అయితే మరీ విడ్డూరం. అది వెజిటేరియన్ అవేర్నెస్ మంతే కాక సీ ఫుడ్ మంత్ కూడా నట. దాంతో ఒక పూట ఇదీ, ఒకపూట అదీ తింటూంటాడు. ఈ మధ్యే జరిగిన ఓ తమాషా సంఘటన గురించి కూడా చెప్పాలిప్పుడు, ఫిబ్రవరి నేషనల్ వైల్డ్ బర్డ్ ఫీడింగ్ మంత్ అట. తెలుగులో చెప్పాలంటే అడవి పిట్టలను మేపే నెలన్నమాట. దాంతో మనవాడు పొట్లాట కొద్దీ గింజలేవో కొని 'అడవికి పోదాం, పక్షులు చూద్దాం చలో చలో, మేతము పెడదాం చలో చలో, పొద్దు పొడిచే ముందుగా నీ ముంగిట వాల్తానోయ్' అంటూ ఓ వారంతపు ప్రాత: కాలాన్నే మా ఇంటికొచ్చి, దగ్గరలో ఉన్న ఓ నేషనల్ ఫారెస్టుకి నన్నూ లాక్కెళ్ళాడు. అక్కడో చోట చేరి దొరబాబు గింజలను విసురుతోంటే నేను అతనికీ, మేత మేయటానికి వచ్చిన పక్షులకూ ఫోటోలు తీస్తూ ఉన్నాను. కొంత సేపటికి రకరకాల పక్షులు చాలా వచ్చిచేరాయి. అంత పెద్ద గుంపూ అక్కడ చేరినా ఇంకా తాపీగా ఒక గింజో, అర గింజో విసురుతూ, ఫోటోలకు ఫోజులిస్తూ కూర్చునేసరికి అసహనానికీ, ఆకలకీ లోనైన కొన్ని పక్షి రాజములు దొరబాబు నెత్తినా, చేతినా టకూ టకూ మని పొడిచి గింజల పొట్లాన్ని కాస్తా తన్నుకు పోయాయి. అవి పొడుస్తున్నప్పటికంటే వాటి తాకిడికి దొరబాబు తత్తరపాటుతో వేసిన కుప్పిగంతులు, పిల్లి మొగ్గలూ చూసి నాకింక నవ్వాగింది కాదు. పగలబడి నవ్వుతున్న నన్ను చూసి, 'ఎందుకయ్యా అలా కుమిలి కుమిలి నవ్వుతావు. దానిలో అంత నవ్వటానికేముందీ' అని మరింత ఉడక్కున్నాడు. ఈ విషయంలో ఆఫీసులో అందరికీ తెలిసిందనీ, దాన్ని తలచుకుని రోజుల తరబీ మేమంతా నవ్వుకున్నామనీ వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. ఇలాంటి అలవాట్లున్న దొరబాబు వల్ల మాకందరికీ వినోదమూ, విజ్ఞానమూ తప్ప వేరే హాని లేకపోవడం చేత గత జూన్ లో మా ఆఫీసులో క్రొత్తగా చేరిన కొద్ది రోజులకే అతనో ప్రముఖ వ్యక్తి అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారం వచ్చేసరికి మాకందరికీ ఆసక్తి పెరిగింది. ఎందుకంటే టీవీనీ విపరీతంగా చూసే దొరబాబు టీవీ టర్నాఫ్ వీక్ ని ఎలా గడుపుతాడా అని. ఎప్పుడైనా ఎయిడ్స్ వాక్ అనో, బ్రెస్ట్ క్యాన్సర్ రన్ అనో, ఆస్తమా అవేర్నెస్ ఫండ్ రెయిజర్ అనో పోస్టర్ గానీ, ప్రకటన గానీ కనబడితే దాని గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ, వాటి విజయనికి తన వంతు కృషి చేస్తూ హడావిడి చేసే దొరబాబూ 'డోంట్ లెట్ లైఫ్ పాస్ బై యు' అన్న దూరదర్శినీ రహిత వారోత్సవాల ప్రకటనలు కనబడటం మొదలైనప్పటినుంచీ తెగ చిరాకు పడుతున్నాడు. 'అదేమయ్యా, ఆరోగ్యం అంటూ కందమూలాలూ, కషాయాలూ రోజుల తరబడీ త్రాగి ఆయా ఉత్సవాల విజయానికి ఇతోధికంగా పాటు బడ్డ నీకు ఒక్కవారం పాటు టీవీ కట్టెయ్యడం కష్టమా?' అంటే, 'అవన్నీ ఒకెత్తు' అంటాడు. ఆ 'ప్రాపంచిక విషయాలూ, వాతావరణం సూచనలూ, వగైరాలన్నీ తెలియక పోతే ఇబ్బంది కాదూ' అంటాడు. ఆ విషయాలు తెలియాలంటే రేడియోలూ, న్యూసు పేవర్లూ, ఇంటర్నెట్లూ లేవూ. ఒక వారం పాటు ఈ విషయాలు తెలియకపోయినా మునిగిపోయే కొంపలేమీ లేవు. కానీ ఆ మాట మనం అంటే ఒప్పుకోడు. అసలు విషయం ఏమిటంటే మనవాడికి అపరాధపరిశోధనకి సంబంధించిన షోలంటే యమ ఇష్టం. మూడు సీ.ఎస్.ఐఎస్, నంబర్స్, వగైరా వగైరాలన్నీ కడు ప్రీతితో చూసే మనవాడికి న్యూసూ, వెదరూ ముఖ్యమేమీ కాదు. అయితే ఆ విషయాలన్నీ బహిరంగంగా ఒప్పుకోడు. 'పోనీ ఇతర ప్రోగ్రాములన్నీ మానేసి కావలసినపుడు న్యూసూ, వెదరూ చూడూ' అంటే 'అలా చెయ్యడం మోసం చేసినట్టవదూ?' అంటాడు అసంతృప్తిగా. 'మరలాంటప్పుడు టి.వీ. అంటే, అంతగా ఇష్టపడే వాడివి శుభ్రంగా చూస్తే పోలా' అంటే 'ఇన్ని రకాల దినాల్నీ, వారాల్నీ నెలల్నీ అబ్జర్వ్ చేసిన వాడిని దీన్ని చెయ్యకపోతే నామోషి కాదూ' అంటాడు. 'సరే ఆ వారంలో అధిక భాగం నేనూ ఎటూ ఊళ్ళో ఉండనుగా, నాకెందుకులే, నీ కష్టాలేవో నువ్వు పడు' అని వూరుకున్నాను.ఆ తర్వాత నాలుగు రోజులు ఆఫీసు పనిమీద ఊరికెళ్లిన నేను తిరిగి వచ్చేసరికి పాతిక లంఖనాలు చేసిన వాడిలా నీరసించి పోయి కనిపించాడు దొరబాబు. ఏమయ్యిందయ్యా అంటే సరిగ్గా చెప్పలేదు. పనిహడావిడిలో ఆపూట వివరంగా మాట్లాడటం కుదరక, సాయంత్రం అతనింటికి ఫోన్ చేస్తే అతను ఇంట్లో లేడని తెలిసింది. టీ.వీ. లేకుండా మనవాడు ఎలా మేనేజే చేస్తున్నాడూ అని అతని భార్యని అడిగితే తెలిసిన విషయమేమిటంటే, టీవీ చూడక మొదటి రోజు సాయంత్రమంతా కాలు కాలిన పిల్లిలా తిరిగిన మనిషి, మరుసటి రోజుకల్లా నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేయడం, చిరాకు పడటం, అందరి మీదా విసుక్కోవటం లాంటి విత్ డ్రాయల్ సింప్టమ్స్ చూపించాడట. ఇంకా ఊరుకుంటే గిల్లటం, మీదపడి రక్కటం లాంటి దుశ్చర్యలకు ఉపక్రమిస్తాడేమోనని భయపడిన ఆ ఇల్లాలు ఓ సలహా ఇచ్చిందంట. 'టీవీ చూడకూడదన్నారు కానీ సినిమాలు చూడకూడదు అనలేదు కదా. మీరు ఆ సినిమాలేవో చూస్తూ కాస్త శాంతించండి బాబూ, ఇంటిల్లిపాదీ కాస్త ప్రశాంతంగా ఉంటాం' అని చెబితే, మొత్తానికి విని కొన్ని పాత సినిమా డీవీడీలు తెచ్చుకుని వాటిని చూడడం మొదలు పెట్టాడట. (కొత్త సినిమాలు కాకుండా ప్రత్యేకంగా పాత వాటిని చూడటంలో ఏదో అంతరార్థం ఉందని నా ప్రగాఢ నమ్మకం. మసాలా దట్టించిన, కంగాళీ కొత్త సినిమాలు కన్నా, శాకాహారం లాంటి పాత సినిమాలను చూస్తే తక్కువ అపరాధ భావం ఉంటుందన్న ఆలోచన మావాడి కొచ్చి ఉంటుందన్నది నా యోచన). పిల్లల చేత హోం వర్కులు చేయించడం, వాళ్ళని ఆటలకీ, పాటలకీ తీసుకువెళ్లి రావడం, ఇతరత్రా పనులన్నీ పూర్తి అయి, వాళ్ళు పడుకున్నాక (అవును మరి వాళ్ళకి తన నిర్వాకం తెలియకూడదుగా) సుదీర్ఘమైన తెలుగు సినిమాలు చూడటం మొదలుపెట్టి, ఏ అర్థరాత్రి వరకూనో మేలుకుని ఉండి, సరిగా నిద్ర చాలక నీరసించి పోయాడు అన్నది అసలు కథ. సినిమాలను ఇన్ స్టాలు మెంట్స్ లో చూసే అలవాటులేదులెండి మనవాడికి. టైటిల్స్ నుంచి శుభం కార్డు వరకూ ఏకధాటిన చూస్తేగానీ సినిమా చూసినట్లుండదు అంటాడు. కథ ఇక్కడితో అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంకా ముఖ్యమైన విషయం ఆ పైవారానికి గాని బయల్పడలేదు. అదేమిటంటే, ముందు వారంలో తను చూసే గంటల కొద్దీ టివీ ప్రోగ్రాములన్నీ రికార్డు చేసుకుని, తరువాత వారంలో మామూలు ప్రోగ్రాములతో బాటు రికార్డు చేసిన వాటిని కూడా చూస్తూ రాత్రులు నిద్రకు మరింత దూరమై, పగలు అలసటకు మరింత దగ్గరై వడిలిపోయిన తోటకూర కాడలా తయారయ్యాడు మా దొరబాబు. 'పచ్చి కూరల మాసం (నేషనల్ సాలాడ్ మంత్ ) అయిన మే నెలకి సింబల్ గా.



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.