గాళ్ ఫ్రెండ్
'ఇండియా ఇండియా ఇండియా' ఏముంది? ఇండియాలో? అంత పద్ధతీ, సంస్కృతీ కావాలనుకుంటే అక్కడే ఉండలేక పోయారా ? అపుడేమో మీ అవుసరానికి, సంపాదన కోసం డాలర్ల మోజులో ఇక్కడి కొచ్చారు. మాకు గట్టిగా నాలుగేళ్ళు కూడాలేవు. మాటలే సరిగా రాని వయస్సు. ఎల్.కెజి.నుంచి ఇక్కడే చదివాం. ఇక్కడి పద్ధతిలోనే పెరిగాం. ఇప్పుడు అమాంతంగా అక్కడి పద్ధతులు సంస్కారాల గురించి చెప్తె మాకేం తెలుస్తుంది? అలవాటైతె వండిపెట్టాల్సి వస్తుందని తిండి దగ్గర్నుంచి ఇక్కడివే పీజాలు, బ్రెడ్డులు, డోనట్లు, పెట్టి మన తిండికూడా మర్చిపోయేలా చేశారు. మీ సుఖాల కోసం నచ్చినా నచ్చక పోయినా `ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని మా మానాన మమ్మల్ని వదిలేసారు. అలాగే మా పాలు మేమే వేడి చేసుకుని, మాతిండి మేమే తిన్నాం. అలాంటిది ఇప్పుడు అమాంతంగా మనదేశం, మన సాంప్రదాయం అంటూ ప్రాణాలు తీస్తే మాకేం తెలుస్తుంది?' అంటూ నిర్విరామంగా వచ్చీరాని తెలుగులో తల్లిని సాధిస్తూనే ఉంది లావణ్య. లావణ్య అంటే నిజంగానే లావణ్యం ఉట్టిపడేలా ఉంటుంది. తెల్లగా, ముద్దుగా, బొద్దుగా, అందంగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం. ఏ డ్రస్సు వేసుకున్నా చక్కగా నప్పుతుంది. ఇక్కడి అమెరికన్ అమ్మాయిలకి తీసి పోనట్టుగా ఉంటుంది. నిజానికి తనకి చిన్నప్పటి నుంచీ పట్టు పరికిణీలన్నా, పెద్ద పెద్ద జడలన్నా, అందంగా అలంకరించుకోవాలన్నా, బోలెడు నగలు పెట్టుకోవాలన్నా చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఇక్కడ కొచ్చాక అవన్నీ బలవంతాన వదిలేసి ఈ కత్తిరింపు జుట్లు, ఈ పాంటు, షర్ట్ లు, చలికి కోట్లు అన్నిటికీ అలవాటు పడి పోయింది. అంతేకాదు... అమ్మ మాత్రం? అమెరికా గొప్ప కోసం బొట్టు పెట్టుకోదు, గాజులు సరేసరి, మట్టెలూ, మంగళసూత్రాలు ఎప్పుడు పరుపు కిందే. చీరలు, నగలు నామోషీ. ఇంక తనకి మాత్రం ఎందుకివన్నీ చెప్పడం? తను మాత్రం అన్నీ చేయవచ్చు. నేనేం చేసినా ప్రతీదీ వద్దు వద్దు. ఇది మన పద్ధతి కాదు. స్లీపోవరు వద్దు, ఫ్రెండుతో సినిమాలు కుదరదు, వాటరు పార్కులు, పిక్ నిక్ లు అసలే కుదరవు. ఇలా అన్నిటికీ అడ్డాలే. ఏది ఏమైనా తన నిర్ణయం మార్చుకోదు. అందుకే ముందుగా డాడీకే చెప్పాలి. అసలిక్కడ ఒకరినొకరు పట్టించుకోరు. అవుసరమైతే తప్ప పలకరించుకోరు. ఎవరి గోల వారిదే. మన ఇండియాలో లాగ జీవితాంతం పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఉండరు. అసలు భార్యా భర్తలే ఎన్నాళ్ళు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. తన ఫ్రెండ్స్ చాలా మంది `స్టెప్ ఫాదరుతో బాధ పడుతున్నామని, స్టెప్ మదర్ సరిగా చూడటంలేదని, హాఫ్ బ్రదర్, హాఫ్ సిస్టర్ తో కొట్లాటలని చెప్పి బాధపడుతూ ఉంటారు. కొన్ని అర్ధమైనా, కొన్ని అర్ధం కాక విని ఊరుకుంటుంది. ఒకోసారి ఎందుకొచ్చిన అమెరికా? అనిపిస్తుంది. ఏం చేస్తాం? అలవాటు పడ్డాక తప్పదు కదా? అందుకే అమ్మతో వాదనకి దిగింది. ఇక లాభం లేదనుకొని డాడీతో మాట్లాడటానికే నిర్ణయించుకుంది.
`డాడీ! నేను రాబర్ట్ ని పెళ్ళి చేసు కుంటాను!' అంది డిన్నరు చేస్తు. `నీకేమన్నా మతి పోయిందా?, వాళ్ళకీ మనకీ ఎలా కుదురుతుంది? , అన్నాడు సాలోచన గా!' అప్పటి కే కొన్నాళ్ళుగా వాళ్ళ పరిచయాన్ని పసిగట్టిన శ్రీనివాస్ . `ఎందుకు కుదరదు? ఇష్ట పడినప్పుడు కష్టం అనిపించదు' అంది తండ్రిని సూటిగా చూడటనికి కొంచం భయపడి కళ్ళు దించుకుని. `ఇది సినిమా కాదు. జీవితం. అనుకున్నంత తేలిక్కాదు ఆచరణలో!' `ముందు కొంచెం కష్టం అనిపించినా, రాను రాను అలవాటౌతుంది' మొండిగా అంది. `అదికాదురా మన కట్టుబాట్లు, ఆచారాలు వేరు. అలాటివేవీ తెలియని వాళ్ళు వీళ్ళు! చాలా నెమ్మదిగా, లాలనగా అన్నాడు. `అదికాదు డాడీ! అతను కాలేజి చదువప్పట్నుంచీ పరిచయ మైనవాడే, వాళ్ళింట్లోను మనింట్లోను అందరికీ తెలుసు. ఇలా తెలిసిన వాణ్ణి చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా ?' `మనకి తెలిసింది పై పై పరిచయాలే. పైగా ఇక్కడి వాడు' అన్నాడు నచ్చ చెప్పే ధోరణిలో . `అక్కడా ఇక్కడా, ఇక్కడా అక్కడా? ఒకటే గోల అంత పట్టింపు ఉన్న వాళ్ళూ అక్కడే ఉండలేక పోయారా? ఇక్కడకి తెచ్చి మా ప్రాణాలు తియ్యక పోతే? మీరు మాత్రం ఐన వాళ్ళందర్ని వదులుకుని ఇక్కడి పద్ధతులకు అలవాటు పడలేదా?' రోషంగా అని డిన్నరు సగంలో లేచి పోయింది'. `నువ్వు చాలా పెద్ద దానివై పోయావ్! బాగా ఆలోచించుకో ఎందుకైనా మంచిది' హెచ్చరిం చాడు శ్రీనివాస్. `దానిష్టానికలా వదిలేసారేమిటండీ? చిన్నపిల్ల దానికేం తెలుసు?' బాధగా అంది భార్య సుసీల. `నీకేం తెలియదు. నువ్వూరుకో!' అన్నట్టు సైగ చేసాడు. `తండ్రి కాస్త ఆసరా ఇచ్చేసరికి, రెట్టించిన ఉత్సాహంతో' నువ్వు కాదన్నా, డాడీ ఒప్పు కుంటాడులే అన్నట్టు చూసింది తల్లి వైపు నిర్లక్ష్యంగా. మర్నాడు ఈ సంగతి రాబర్ట్ కి చెప్పెయ్యాలన్న ఆనందంలో కాస్త ముందుగానే వెళ్ళింది కాలేజీకి. ఆరోజు కాదుకదా వారం పది రోజులైన అతగాడు కనుపించ లేదు. మతి పోయింది లావణ్యకి. తామిద్దరూ తిరిగిన రెస్టారెంట్లు, ఐస్క్రీం పార్లర్లు... అన్నీ లీజర్ టైములో తిరిగి తిరిగి గాలించింది. చివరికి ఒక రోజు సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళడం ఇష్టంలేక కాంపస్ లో చెట్లక్రింద కూర్చుందామని వెడు తుంటే ఎదురుగా బెంచీ మీద రాబర్ట్ మరొక అమ్మాయితో కిల కిలలు. ఆమెని తనెప్పుడూ చూడలేదు. దగ్గరగా వెళ్ళి అడిగింది `ఎవరీమే? ఇన్నాళ్ళూ ఎక్కడికెళ్ళావ్?' అని. మనస్సులో ఏదో తెలియని జెలసీ, గుండెల్లో సన్నని బాధ. `ఏం? ఎందుకు? ఈమె నా గాళ్ ఫ్రెండ్. అలా అలా జాలీగా తిరిగొచ్చాము. ఎప్పుడూ స్టడీఏనా? బోర్' అన్నాడు విలాసంగా నవ్వుతూ... ఇంగ్లీషు లోనే.
`మరి ఇన్నాళ్ళు మనం కుడా సినిమాలు, షికార్లు తిరిగాం కదా?' అంది నీరసంగా. `అవును తిరిగాం. ఫ్రెండ్స్ అంటే అందరితోటి తిరుగుతాం. వాటీజ్ దేర్?' నిర్లక్ష్యంగా తలెగరేసాడు. `ఐతె నా మీద లౌ లేదా? సూటి గా అడిగింది సహనం కోల్పోయి' `ఆహాహాహా విరగబడి నవ్వాడు. లౌ లౌ షి ఈజ్ ఆల్సొ మై లౌ అంటూ పక్కనే ఉన్న ఆమెని దగ్గర గా తీసుకుని వాటేసుకున్నాడు. `యూ...చీట్... మోసం...మోసం....చేసావ్? ఇంకా నయం నిన్ను పెళ్ళి చేసుకుందామనుకున్నాను' అంది ఎంతో అమాయకంగా లావణ్య. `మ్యారీ యు వాంటు మ్యారీ వాటె హెల్ ?నొ...నొ...నొ..! అలాంటివి మాకు తెలియదు. లైఫ్ ఎంజయ్ చేయడమే మాకు తెలుసు. మీ ఇండియన్సుకి ఉన్న జబ్బే ఇది. బతకడం చేతగాదు. చచ్చిందాక ఒకడే భర్త, ఒకటే భార్య. పూర్ సెంటిమెంట్స్' అని విరగబడి నవ్వుతూ తనతో ఉన్న ఆమెని మరింత దగ్గరగా పొదివి పట్టు కున్నాడు. లావణ్యకు రోషం, ద్వేషం, ఉక్రోషం, బాధ ఒక్కుమ్మడిగా నిలువెల్లా దహిస్తుండగా `దెన్! వాటెబౌట్ మి?' గట్టిగా అరిచింది. `యు...ఆరె.ఎ..గాళ్...ఫ్రెండ్...ఓన్లీ ...ఎ...గాళ్ ...ఫ్రెండ్..దట్సాల్!' అన్నాడు నిర్లక్ష్యంగా. పక్కనే ఉన్న ఆమె వైపు తిరిగి మరింత దగ్గరగా తీసుకుంటూ. `అంతే గిరుక్కున వెనుదిరిగింది. కళ్ళముందు స్టెప్ ఫాదర్లు, స్టెప్ మదర్లు, రోజుకో అమ్మాయి, భార్యలమార్పిడి, ఒహో....వద్దు...వద్దు...అలా వీల్లేదు. ఈ పద్ధతి మన మన రక్తంలో లేదు. పూటకో గాళ్ ఫ్రెండ్, రోజుకో బోయ్ ఫ్రెండు, తన వల్ల కాదు. ఇన్నాళ్ళ స్నేహంలో తను కనిపెట్ట లేక పోయింది. అందుకే మన భారతీయత, మన కట్టుబాట్లు మనకే స్వంతం. గర్వించ తగ్గ సాంప్ర దాయాల్ని వదులుకుని తానెంత వెర్రి వ్యామోహంలో పడింది? ఎంత ఇక్కడే పెరిగినా తెలుగు చదవటం, రాయడం రాకపోయినా కొన్ని సినిమాలు, పురాణ గ్రంధాలు చూస్తుంటే అనిపిస్తూనే ఉంటుంది మనం ఏమి కోల్పోతున్నామో, ఎంత నష్ట పోయామో? అందుకే నేమో, తనలోనూ ఆ రక్తమే ప్రవిహిస్తున్నట్టుంది. అందుకే అతగాడి చేష్టలు, మాటలు భరించలేక పోయింది... థాంక్ గాడ్!! ఇంతటితో బయట పడింది. ఈ మాత్రానికేనా? అమ్మా, నాన్నలతో అంతగా వాదించింది?' అనుకుని తేలిక బడిన మనసుతో ఐయాం ఓన్లీ ఎ గాళ్ ఫ్రెండ్... నాట్... మోర్ దేన్... గుడ్...బై...' అని చెప్పి... తమ స్నేహాన్ని నెమరు వేసుకుంటూ బరువెక్కిన గుండెలతో... బరువు... గా... ఇంటి వైపు అడుగులు... వేసింది... లావణ్య.