Articles - Grahanam




Name: Admin

Published Date: 06-04-2016


గ్రహణం

(చిలుకూరి దేవపుత్ర) `పురపాలక అప్పర్ ప్రైమరీ పాఠశాల' అన్న బోర్డు చూసి, దానికి అవతల ఉన్న పిల్లల గలాటా... ఆ గలాటాలోనే భాగంగా `పన్నెండు రెండ్ల ఇరవై నాలుగు'... అంటూ గొంతులు చించుకుని ఎక్కాల్ని పలుకుతున్న పిల్లలను చూస్తూ ఆ బడి ఆవరణలోకి అడుగుపెట్టాడు చందు, చేతిలో రికార్డు షీట్లతో. అతని పిల్లలిద్దరూ రమ్య, రాజు బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ బెదురుచూపులు చూస్తూ నడుస్తూ ఉన్నారు. రమ్యని 5వ తరగతిలోనూ, రాజూని 3వ తరగతిలోనూ చేర్పించాలని అక్కడికొచ్చాడు చందు. ఒక క్లాసు గదిలోంచి ఒక పిల్లోడు నిక్కర్ని ఎగేసుకుంటూ ఓంటేలుకనేమో కాంపౌండ్ బయటకి పోతూ కనిపించాడు. ఇద్దో బాబూ! అంటూ వాడిని నిలిపాడు చందు. ఏమిటన్నట్టు చూశాడు ఆ పిల్లోడు. మీ హెడ్మాస్టర్ ఎక్కడుంటారు? అనడిగాడు. అక్కడ అంటూ తూర్పు వైపున ఉన్న గదివైపు వేలు చూపించి, రమ్య, రాజుల్ని ఒక్కసారిగా ఎగాదిగా చూసి, గిరుక్కున తిరిగి తను వెళ్ళాల్సిన పని గుర్తొచ్చి పరుగెత్తుకెళ్ళిపోయాడు. హైడ్మాస్టరు గదికి చేరుకున్నాడు చందు. హెడ్మాస్టరొక్కడే ఏదో రిజిస్టరు రాస్తూ ఉన్నాడు.... రాసింది సరిగ్గా ఉన్నట్టు తల ఊపుతున్నాడు. నమస్తే సార్! అన్నాడు వాకిట్లో నుంచే చందు. తలెత్తి చూశాడు హెడ్మాస్టర్. ఎస్ కమిన్ అన్నాడు. ప్రతి నమస్కారం చేయకపోగా లేటుగా వచ్చిన పిల్లల్ని క్లాసులోకి రమ్మన్నట్టుగానే ఉంది ఆయన తీరు. లోపలికి వెళ్ళి హెడ్మాస్టరు ముందున్న కుర్చీలో కూర్చుని, తను అక్కడికి ఎందుకు వచ్చిందీ తెలిపాడు చందు. హెడ్మాస్టర్ వయసు నలభై ఏళ్ళు ఉంటాయి. నల్లగా ఉన్నాడు. కొంచెం బట్టతల, వెంట్రుకలున్న భాగాన్ని మామూలుగా దువ్వినట్టు అనిపించదు, అల్లరి చేసే పిల్లల్ని బెత్తంతో బెదిరించి, అదుపులో ఉంచినంతగా అనిపిస్తుంది. అక్కినేని కాలం నాటి మీసకట్టూ, నున్నగా షేవ్ చేసిన గడ్డం, కళ్ళకున్న రోల్డుగోల్డు ఫ్రేం అద్దాలూ... అన్నీ కలిసిన గంభీరమైన మొహం అతనిది అనుకున్నాడు చందు.

అంతా విన్నాక కళ్ళద్దాల్లోంచి, కాసేపు చందూని, అతని బట్టల్ని, ముఖ వర్చస్సుని పరిశీలించాడు. ఆ తర్వాత, రమ్య, రాజుల్ని జాగ్రత్తగా చూశాడు హెడ్మాస్టర్. మీరెక్కడ పని చేస్తున్నారు? అడిగాడు హెడ్మాస్టర్. చెప్పాడు చందు. అచ్చమైన మధ్యతరగతి మనిషి. అందులోనూ కలెక్టెరాఫీసులో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న మనిషి ఎట్లా ఉంటాడో అలానే ఉన్నాడు చందు. అతని పిల్లలు కూడా ఇస్త్రీ చేసిన గుడ్డల్ని వేసుకొని, నీటుగా తలలు దువ్వుకొని ఉన్నారు. ఈ స్కూల్లోనే వీళ్ళను ఎందుకు చేర్పించాలనుకుంటున్నారు? అడిగాడు చందులో కొంచెం అసహనం చోటుచేసుకుంది. అయినా సహనంగానే `నా పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించాలనుకున్నాను కాబట్టి!' అన్నాడు దృఢంగా. `ఈ స్కూలులో ఏం చదువు వస్తుందండీ! ఇక్కడ ఏడు తరగతులుంటే ముగ్గురు టీచర్లున్నారు... మీరు ఏమీ అనుకోను అంటే ఒక విషయం చెబుతాను... ఇక్కడికి దగ్గర్లో `గోల్డ్ బెల్స్' అనే ఇంగ్లీషు కాన్వెంటు స్కూలు ఉంది. అక్కడ చదువు బాగా చెప్తారు. నా కొడుకు లిద్దరూ అక్కడే చదువుకొంటున్నారు అన్నాడు హెడ్మాస్టరు'. చందూకి సహనం పూర్తిగా చచ్చిపోయింది.... కోపం నషాళానికి అంటుతూ ఉంది. అయితే ఆ కోపాన్ని వీలైనంత వరకు వినయంలోనికి అనువాదం చేసుకొని, `సార్! మా పిల్లల్ని ఉరవకొండలో పంచాయతీ ఎలిమెంటరీ స్కూల్లో చదివించాను. ఎందుకో తెలుసా... తెలుగు మీడియం కోసరం. నా కర్మ కొద్దీ ఇక్కడికి బదిలీ అయ్యిది. వచ్చాను. నాకు తెలిసినంతవరకూ ఏ దేశంలోనైనా పిల్లలు వాళ్ళ మాతృభాషలో చదువుకుంటేనే విషయాలను ఎంతో బాగా అర్థం చేసుకుంటారు. తర్వాతి కాలంలో ఏ భాషలోనైనా, ఏ విషయంలోనైనా రాణిస్తారు. మాతృభాష అంటే పిల్లలకు తల్లి పాల వంటిదండీ, అందుకే నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తాను' అన్నాడు చందు. `పొరపాటు సార్! మీరు ఏ కాలం మాటలో మాట్లాడుతున్నారు. ఇప్పటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలుగుదేముందండీ! మనం మాట్లాడుకునే భాష. అది రాకుంటేనేం!' అన్నాడు తేలిగ్గా హెడ్మాస్టర్.

`ఏమిటండీ! మరీ తెలుగును తీసి పారేస్తున్నారు? మీరసలు హెడ్మాస్టరేనా? పది కోట్లమంది మాట్లాడే భాషను, ప్రపంచంలోనే ఆరో స్థానాన్ని ఆక్రమించిన భాషను అట్లా తీసి పారేస్తారా? మహామహులంతా నేర్చుకున్నది వాళ్ల మాతృభాషలోనే. అందుకే వాళ్ళ భావాలు అంత ఉన్నతంగా ఉన్నాయి. తెలుగు బళ్ళో హెడ్మాస్టరుగా ఉంటూ మీ పిల్లల్నిఇక్కడే చేర్పించకుండా, ఎక్కడో ఇంగ్లీషు కాన్వెంటులో చదివిస్తూ ఉన్నారంటే మీ సంస్కారం ఏమిటో తెలుస్తా ఉంది. ఇట్లాంటి చోట నా పిల్లలు చదవడం నాకు అసహ్యం' అనేసి పిల్లల్నిద్దర్నీ రెండు చేతుల్తో లాక్కుంటూ బయటికివచ్చేశాడు చందు. వింత మనిషిని చూస్తున్నట్టు అవాక్కయి ఉండిపోయాడు హెడ్మాస్టరు. రాత్రి భోంచేశాక - చందు ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో గవర్నమెంటు ఎలిమెంట్రీ స్కూలు ఉందనీ, అందులో చేర్పిద్దామని చెప్పంది చందు భార్య. మరుసటి రోజు పొద్దున్నే పేపర్ చదువుకుంటూ వరండాలో అరుగు మీద కూచుని కాఫీ తాగుతూ ఉన్నాడు చందు. `ఏమప్పా బాగుండావో!' అన్న పలకరింపుతో తలెత్తి చూశాడు. ఆ వచ్చింది అతని దూరపు బంధువు మునెయ్య. తెల్ల చొక్కా, అడ్డ పంచెతో ఉన్నాడు. మనిషి కారునలుపు. అయితే స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటాడు. జిల్లాలోని మారుమూల పల్లెనించీ ఇరవై ఏళ్ళ క్రితం అనంతపురానికి చేరుకున్నాడు. అదేదో మోటారు ట్రైవెల్స్ లో హమాలీగా పనిచేస్తూ ఉంటాడు. `ఆ! బాగున్నానన్నా! ఏమీ ఈ నడుమున కనపడేదే లేదే?' అన్నాడు నవ్వుతూ చందు. `అవును - చాన్నాళ్లాయే కదా నేను ఈటికి రాక' అంటూనే చందు పక్కనే కూచున్నాడు మునెయ్య. చందు భార్య, మునెయ్య వచ్చింది గమనించి, వెంటనే కాఫీ ఇచ్చింది. ఆమెను పలకరించాడు అతను. కాసేపు మాట్లాడుకున్నాక జేబులోంచి ఒక కవర్ని తీసి చందూకిచ్చాడు మునెయ్య. కవరు తెరిచాడు... అందులోంచి ఒక ఫోటో బయటికి తీశాడు చందు. అది రంగుల్లో తీసిన ఫోటో... నాలుగేండ్ల పిల్లోడు - ఎర్ర నిక్కరూ, ఆకుపచ్చ చొక్కా వేసుకొని అమాయకంగా నవ్వుతూ ఉన్నాడు. ఎవరనుకుంటి చంద్రప్పా! నా కొడుకు వెంకటరమణ అన్నాడు మురిపెంగా నవ్వుతూ మునెయ్య.

చానా బాగుండాడన్నా! నీ కొడుకు అన్నాడు చందు. ఇద్దో చంద్రప్పో! వీడు చూసేందుకే కాదప్పా మాటల్లో కూడా ఏమీ తెలివితేటలనీ! అబ్బబ్బా ఎన్ని ఎన్ని తెలివితేటలో ఆ సిన్న తలకాయలో. నాకయితే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. వాడు పొయ్యిలో పెడితే పొంతలో ఎల్లొస్తాడు. పొంతలో పెడితే పొయ్యిలో ఎల్లొస్తాడు. నేను ఈటికి వస్తా ఉంటే ఏమన్నాడనుకుంటివి... నాయినా నీ మాదిరి నేను అమాలీని కాను, బాగా చదువుకోని పెద్ద ఆఫీసర్ని అయితా అనంటున్నాడు అంటూ నవ్వుతూ కొడుకు ఫోటో వంకే చూస్తు ఉన్నాడు మునెయ్య. చందుకి మునెయ్య మాటల్లో బడాయి కనిపించలేదు. తమ పిల్లల గురించి, ఎంతో మంది చదువుకున్నోళ్ళకంటే అతను తక్కువే చెప్పాడనిపించింది. సరేగాని, ఒకసారి వీడ్ని ఇక్కడకు తీసుకురా, అందరం చూస్తాం అన్నాడు చందు. తప్పకుండా పిల్సుకోని వస్తా, వాడు మాట్లాడేటప్పుడు మీరంతా వాని నోటికల్లే జూస్తా ఉండిపోతారేమో అన్నాడు మునెయ్య. వాడ్ని బాగా చదివియ్యన్నా! అంటూ ఫోటోని కవర్లో పెట్టి మునెయ్యకి అందించాడు చందు. అవునప్పా! సదివియ్యల్ల... అట్లా ఇట్లా తెలుగుబడిలో కాదప్పా! మంచి ఇంగ్లీషు కాన్వెంటు బడిలో ఏస్తా... నాకెటూ సదువురాలా... వాడన్నా బాగా సదువుకోని పెద్దయినాక వాడు ఉత్త ఇంగ్లీషే మాట్లాడాలా అన్నాడు మునెయ్య. ఇంగ్లీషు బల్లో ఎందుకన్నా! తెలుగుబడిలో చేరిపించు బాగా చదువుకుంటాడు అన్నాడు చందు. లేదు లేదు. వాడు ఎంత తెలివైనవాడో మాటల్లో చెప్పలేను. అందుకే కచ్చితంగా ఇంగ్లీషే సదివిత్తా! ఇంకొక పదేండ్లకి సూడుమల్లా నువ్వే ఆచ్చెర్యపోతావు అన్నాడు మునెయ్య. గొంతులో దృఢత్వం కనిపించింది చందూకి. ఇంట్లో తల్లీ తండ్రి చదువుకున్న వాళ్ళయి ఉండీ పిల్లలకి ఇంటి దగ్గర హోంవర్కు చేయిస్తూ, ట్యూషన్లకి పంపుతూ ఉన్న పిల్లలకి ఇంగ్లీషు కష్టం మీదయినా వస్తుంది. అట్లాంటిది మునెయ్యకి, అతని భార్యకీ తెలుగు అక్షరం ముక్కేరాదు. మరి అతని కొడుకుని ఇంగ్లీషులో ఎట్లా చదివిస్తాడు? మునెయ్య అమాయకత్వానికి జాలిపడ్డం మినహా మరేమీ చేయలేకపోయాడు చందు. అయిదు నిమిషాల తర్వాత మునెయ్య వెళ్ళిపోయాడు. తొమ్మిది గంటలు అవుతుండగా పిల్లలిద్దర్నీ వెంటేసుకొని, రికార్డు షీట్లు చంకన పెట్టుకుని గవర్నమెంటు ఎలిమెంటరీ స్కూలు చేరుకున్నాడు. ఆ కాంపాండులో ఎలిమెంటరీ స్కూల్ తో పాటూ, హై స్కూలూ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా ఉన్నాయి. అయితే ఎలిమెటంరీ స్కూలు తప్ప అన్నింటిలోనూ ఒక అడపిల్లకు మాత్రమే ప్రవేశం.

ప్రేయర్ జరుగుతున్నందువల్ల స్కూల్ గేట్లు వేసినారు. లేటుగా వచ్చిన పిల్లలంతా గేటు కడ్డీల్లోంచి స్కూలు వైపు చూస్తూ ఉన్నారు. గేటుకి ఇవతల ఒకామె జామపళ్ళూ, బఠానీలూ చిన్న చాప మీద పెట్టుకొని అమ్ముతూ ఉంది. ఒకరిద్దరి పిల్లలు వాటిని కొంటున్నారు. మమ్మీ! వచ్చేస్తి అంటూ నీలం నిక్కరూ, తెల్ల చొక్కా, గీతల టై, నల్లటి బూట్లు వేసుకున్న కాన్వెంటు స్కూలు పిల్లోడు ఒకడు ఉన్నట్టుండి అక్కడికి ఊడిపడ్డాడు. ఎవర్ని ఆ పిల్లోడు మమ్మీ! అంటున్నది అని చుట్టూ చూశాడు చందు. ఆ మమ్మీ ఎవరో కాదు. జామపళ్ళు అమ్మే ఆమేనని నిర్ధారించుకున్నాడు చందు. మమ్మీ! డాడీ వచ్చేవరకూ నేను పోను అంటూ వీపుకు కట్టుకున్న బడి సంచీని తీయకుండానే అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉన్నాడు. తల్లి వాడిని ఎంతో ముచ్చటగా చూస్తూ ఉంది. ఓలే... రామాంజా! రేతిరి చెప్తివి సూడరా! అదేందో రయిము - అది చెప్పు అన్నదామె. రయిము అంటే రైమ్ అని వెంటనే స్ఫురించింది చందూకి. వాడు వాళ్ళమ్మని చూసి నవ్వి `ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్...' అంటూ చెప్పాడు. జామపళ్ళ ఆమె కుటుంబ ఆర్థిక స్థాయి తెలుసుకొనేందుకు ఆమె భర్త చేస్తున్న ఉద్యోగం గురించి అడిగాడు చందు. బేల్దారి పనికి పోతున్నట్టు చెప్పిందామె. అంటే మునెయ్య లాంటి పరిస్థితే, జామపళ్ళ ఆమెది కూడా! వీళ్ళకి ఎక్కడనించి వచ్చింది ఇంగ్లీషు కాన్వెంటు మీద ఇంత మోజు! అన్నది అర్థం కావడం లేదతనికి. పదిన్నరకల్లా పిల్లలిద్దర్నీ ఆ స్కూల్లో చేర్పించేసి వచ్చాడు చందు. చూస్తున్నట్టే అయిదేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు చందు కూతురు పదోతరగతి పూర్తి చేసింది. 560 మార్కులతో జిల్లాలోనే మొదటి ర్యాంకులో పాసయింది. కొడుకు ఎనిమిదో తరగతి పాసయ్యాడు. ప్రభుత్వానికి సరైన భాషా విధానం లేనందువల్ల మాతృభాష విద్యా విధానానికి స్వస్తి చెప్పి, కార్పొరేట్ స్కూళ్ళతోనూ కాన్వెంటు స్కూళ్లతోనూ పోటీపడుతున్నట్టు ఫోజు పెట్టి, ప్రభుత్వ స్కూళ్ళలోనే ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. వందలాది తెలుగు మాధ్యమ పాఠశాలలు ఇంగ్లీషు కాన్వెంటు స్కూళ్ళ ధాటికి తట్టుకోలేక మూసి వేస్తున్నట్టు రోజూ పేపర్లో వార్తలు... చందూకివన్నీ చదువుతూంటే కాళ్ల కింది భూమి కదిలిపోతున్నట్టుంది. ఇంక పల్లెల్లోని పిల్లలు ఎట్లా చదువుకోగలుగుతారు అని దిగులు పడతాడు. ఆ సాయంత్రం కూరగాయల మార్కెట్టులో కనిపించాడు మునెయ్య చందూకి. కుశల ప్రశ్నలు అయ్యాక- పిల్లోడు ఏం చదువుతున్నాడన్నా అడిగాడు చందు. వానికి ఆ సదువు అబ్బలేదప్పో! పని నేర్చుకోమని కమలానగర్లో ఉన్న మెకానిక్ షాపులో విడిచినాను అన్నాడు మునెయ్య. వెంటనే చందూకి జామపళ్ళ ఆమె కొడుకు గుర్తుకు వచ్చాడు. వాడి పరిస్థితి అంతకన్నా మెరుగ్గా ఉంటుందా? అనిపించింది. ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామీణ పిల్లలందరూ మునెయ్య కొడుకుల్లా మారబోతున్నారా? అన్న నిలువెత్తు ప్రశ్నార్థకం చందు మనసులో...



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.