గురువు మాట
పూర్వం సమర్థానందుడనే పండితుడికి గురుకులాశ్రమం ఉండేది. అనేక మంది అక్కడ విద్యనభ్యసించేవారు.
ఓసారి సమర్థానందుడు జ్ఞానయజ్ఞం చేయడానికి సంకల్పించాడు. నిర్వహణ బాధ్యతలను శిష్యులందరికీ అప్పగించాడు. అనేక ప్రాంతాలకు చెందిన పండితులను ఆహ్వానించే పనిని చిదానందునికి అప్పగించాడు.
‘చిదానందా! ఒంటరిగా ప్రయాణించకు. తోడుగా ఎవరినైనా వెంటబెట్టుకెళ్లు’ అని జాగ్రత్తలు చెప్పాడు.
సరేనని చిదానందుడు బయలుదేరాడు. కొద్ది దూరం ప్రయాణించాక గురువుగారు తోడు తీసుకెళ్లమని చెప్పిన సంగతి గుర్తొచ్చింది. అటూ ఇటూ తోడుకోసం చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఒక ఎండ్రకాయ కనిపించింది. ‘ఏం చేయాలి ప్రయాణం తప్పదు. ఇదే నా తోడు’ అనుకుని తన దగ్గరున్న సంచీలోని చెంబులో ఆ ఎండ్రకాయను వేసుకున్నాడు. అనేక మంది పండితుల దగ్గరికెళ్లి ఆహ్వానం పలికాడు.
మళ్లీ కాలినడకన ప్రయాణం మొదలెట్టాడు. తోవలో ఒక అడవి దాటాల్సి వచ్చింది. ఆ అరణ్యంలో కొద్ది దూరం నడిచాక చిదానందుడు బాగా అలసిపోయాడు. పైగా ఎండ కూడా మండిపోతోంది. వెంట తెచ్చిన సంచీని, చెంబును పక్కన పెట్టి ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. కునుకు పట్టింది.
ఇంతలో అటుగా పెద్ద సర్పం అక్కడకు వచ్చిచేరింది. నిద్రపోతున్న చిదానందున్ని కాటు వేయబోయింది. ఇంతలో చెంబులో జరజరా శబ్దం వినిపించి అందులోకి తల దూర్చింది. ఎండ్రకాయ ఉండడంతో ఇవాల్టికి ఆహారం దొరికిందనుకుని దాన్ని పట్టుకుంది. సర్పాన్ని విదిలించుకోవాలనే ప్రయత్నంలో ఎండ్రకాయ తన కొండితో పాము మెడపై గుచ్చింది. ఆ అలికిడికి చిదానందునికి మెలకువ వచ్చింది. ఆ సర్పాన్ని చూడగానే ఒక్కసారిగా దడపుట్టింది. వెంటనే తుర్రున జారుకున్నాడు.
‘గురువు గారి మాట విని ఎండ్రకాయ తోడు తెచ్చుకోవడం ఎంత మేలు చేసింది. లేదంటే విష సర్పం కాటుకు బలయ్యేవాడిని’ అంటూ గురుకులానికి సాగిపోయాడు.