జానకి
(శ్యామలదేవి దశిక) జానకి భర్తతో అమెరికా వచ్చి 40 ఏళ్ళపైనే అయింది. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి పెరిగి హైస్కూల్ ఫైనల్ వరకే చదువుకున్న జానకి పెళ్లి తమాషాగా ఇట్టే జరిగిపోయింది. బంధువుల ఇంట్లో పెళ్లికని తల్లితండ్రులతో వెళ్ళిన జానకి పెళ్ళికూతురై తిరిగొచ్చింది. ప్రెండు పెళ్ళికని వచ్చిన రవిని, కుందనపు బొమ్మలా వున్న జానకి అందం, ఆమె అమాయకత్వం ఆకర్షించాయి. ఏ ప్రయత్నమూ చేయకుండానే అంత మంచి సంబంధం రావడం చూసి జానకి అదృష్టానికి తల్లితండ్రులు మహా సంబరపడిపోయారు. పిల్లవాడు బాగా చదువుకున్నాడు, టిప్ టాప్ దర్జాగా ఉన్నాడు, అన్నిటినీ మించి కానీ కట్నం లేకుండా చేసుకున్నాడు. పెళ్ళిలో అప్పగింతలు అవగానే అత్తవారింటికి బయలుదేరి వెళ్తున్న జానకితో తల్లి 'మీ అత్తవారు మనలాగా పల్లెటూరి వారు కాదు. పట్నంలో వుండే వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, పైగా వున్నవాళ్ళు. వాళ్ళ పద్ధతులు అలవాట్లు, తెలుసుకొని వాళ్ళ కనుగుణంగా నువ్వు మారాలి గుర్తుంచుకో' అంటూ బోధించింది. అసలే కొత్త చోటుకు వెళ్తున్నానన్న భయంతో వున్న జానకి తల్లితో వెంటనే అలాగే అంటూ తల వూపింది. హైదరాబాద్ లో అత్తవారింట్లో అడుగు పెట్టిన జానకకి అక్కడ అన్నీ వింతగా, కొత్తగా అనిపించాయి. పనివాళ్ళతో, బయటవాళ్లతో చకచకా హిందీలోనూ, జానకికి అర్థం కాని తెలుగుభాషలోనూ, మావగారి ఫ్రెండ్స్ తో కొద్దిగా ఇంగ్లీష్ లోకూడా మాట్లాడే అత్తగారి చాకచక్యం చూసి జానకి ఆశ్చర్యపోయింది. తెలియనివి నేర్చుకుంటూ, కొత్త వాతావరణానికి అలవాటుపడుతున్న టైములో జానకి భర్త 'వచ్చే నెలలో మనం అమెరికా వెళ్తున్నాం' అన్నాడు. బొంబాయిలో విమానం ఎక్కేముందు అత్తగారు జానకితో, 'మనవాళ్ళంటూ ఎవ్వరూ లేని దూరదేశానికి వెళ్తున్నారు ఇద్దరూ, దొరలు-దొరసానులు వుండే దేశం అది. అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. వాడి మనసు గ్రహించి, వాడి ఇష్టానికి తగినట్టుగా నువ్వు మారాలి గుర్తుంచుకో' అంటూ సలహా ఇచ్చింది. అత్తగారంటే ఎంతో గౌరవం వున్న జానకి వెంటనే భక్తిగా తల వూపింది. హైద్దరాబాద్ లో అక్కడి మాటలూ, పద్ధతులూ వింతగా అనిపిస్తే, అమెరికాలో మనుషులతో సహా అన్నీ వింతగా, విచిత్రంగా అనిపించాయి జానకికి. కొత్త దేశంలో, కొత్త వాతావరణానికి, కొత్త రొటీనుకు అలవాటు పడటం మొదలు పెట్టింది జానకి. బయటకు వెళ్ళినప్పుడల్లా గజగజమని వణికే జానకిని చూసి భర్త 'ఎప్పుడూ ఆ నాజూకు నైలాన్ చీరలే కట్టుకుంటే ఎలా? నువ్వు ఇప్పుడు అమెరికాలో ఉన్నావు, ఇక్కడి వాతావరణానికి తగినట్టుగా డ్రస్ చేసుకోవాలి. నువ్వు మారాలోయ్' అన్నాడు. తనను ఏరికోరి చేసుకున్న భర్తమాటకు సంతోషంగా తల వూపింది. బయటకు వెళ్ళేటప్పుడు పాంటు, షర్ట్ వేసుకోవడం అలవాటు చేసుకుంది జానకి. అంతేకాకుండా పార్టీలకు వెళ్ళేటప్పుడు రవికి ఇష్టమయినట్లుగా జుట్టు లూజుగా వదిలేసుకోవడం, లిప్ స్టిక్ వేసుకోవడం, హైహీల్స్ వేసుకోవడం నేర్చుకుంది. చూస్తుండగానే ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఈ పది పన్నెండేళ్ళలో జానకి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. జానకికి ఇప్పుడు ముగ్గురు పిల్లలు. వీలైనప్పుడల్లా కోర్సులు తీసుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్న జానకి చివరి వాడు కూడా స్కూలు మొదలు పెట్టగానే ఫుల్ టైమ్ జాబ్ లో చేరిపోయింది. ఇల్లు, పిల్లలతో, ఉద్యోగంతో జానకికి ఇప్పుడు క్షణం తీరిక ఉండదు. పిల్లలు చిన్నవాళ్లుగా వున్నప్పుడు వాళ్ళు ముద్దు మాటలకు, చిన్న తరగతుల్లో వున్నప్పుడు వాళ్ళ తెలివితేటలకు మురిసిపోయిన జానకి వాళ్ళు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో మార్పు రావడం గమనించింది. ఆ మాటే రవితో అంటే 'పెరిగే పిల్లలు వాళ్లు మారక నువ్వూ నేనూ మారతామా?' అంటూ తేలిగ్గా కొట్టిపారేశాడు. భర్త చెప్పింది నిజమే అని ఎంత సరిపుచ్చుకున్నా తల్లిగా జానకి మనసులో ఆందోళన బయలుదేరింది. పెద్దవాడు విజయ్ స్కూలు నించి ఇంటికి వస్తూనే బుక్ బాగ్ ఓ మూలకు విసురుగా గిరాటేసి రూములోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ఇల్లు అదిరిపోయేటట్లు మ్యూజిక్ ఆన్ చేసేవాడు. కూతురు రేఖ అస్తమానం 'what is that smell, this house stinks?' ఇల్లంతా 'air freshner' స్ప్రే చెయ్యడం మొదలు పెట్టేది. ఇంట్లో వున్నంతసేపు ఎప్పుడు చూసినా ఫోన్ లో ఎవరితోనో మాట్లాడటమో, పోట్లాడటమో చేస్తుండేది. పైవాళ్ళిద్దరిని చూసి చిన్నవాడు వినోద్ ఇంకా త్వరగా మారిపోతున్నాడనిపించింది జానకికి. ఒకరోజు జానకి పనిమీద బయటకు వెళ్ళపోతుంటే 'do you have to go out with that dot?' అంటూ ప్రశ్నించాడు . వాడు దేనిగురించి మాట్లాడుతున్నాడో తెలియని జానకి ఒక్క క్షణం తెల్లబోయి, తర్వత తనలో తాను నవ్వుకుంది! అమ్మా నాన్నల దగ్గర పెరిగినప్పుడు జానకి నుదుట కుంకుమ దిద్దుకొనేది. పెళ్ళి అయి హైదరాబాద్ వచ్చాక అత్తగారు ఐటెక్స్ తిలకం పట్టుకొచ్చి 'చిన్నపిల్లవు చక్కగా ఇది పెట్టుకో బావుంటుంది' అంటే తిలకం అలవాటు చేసుకుంది. తర్వాత అమెరికా వచ్చాక భర్త అమ్మవారల్లే అంత బొట్టెందుకు అంటే చిన్న బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకుంది. ఇప్పుడు వేలెడంత లేడు వెధవ 'ఆ డాట్ లేకుండా వుంటే నీ సొమ్మేంపోయిందీ' అని ప్రశ్నిస్తుంటే జానకికి నవ్వొచ్చింది. ఎప్పుడైనా భర్తతో పిల్లల గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద గట్టిగా అరిచేసి తన బాధ్యత తీరిపోయిందనుకొనేవాడు. తండ్రిని బాహాటంగా ఏమీ అనలేక, మెత్తగా వుండే జానకి మీద వాళ్ళ కోపం, విసుగు అంతా తీర్చుకొనేవారు. జానకి నోరు విప్పి వాళ్ళతో ఏం మాట్లాడబోయినా, వాళ్ళ తప్పొప్పులను సరిచేయబోయినా జానకి యాక్సెంటుని ఎగతాలి చెయ్యడమో, జానకి ఇంగ్లీషుని కరెక్ట్ చెయ్యడమో చేసి అసలు విషయాన్ని పక్కదోవలు పట్టించేవారు. పోనీ ఏదైనా పిచ్చాపాటి మాట్లాడదామంటే, నీకేం తెలియదు. అన్నట్లు చూశేవారు. ఇలా పిల్లల్లో వస్తున్న మార్పు, ఇంట్లో తమతో ప్రవర్తించే తీరు చూసి జానకి భయపడి ఏమి చేయాలో తోచక దిగులు పడ్డం మొదలు పెట్టింది.ఒక రోజు జానకి పనిచేసే ఆఫీసులోనే వేరే డిపార్ట్ మెంట్లో పనిచేసే సునీత కనిపించి 'ఏమిటి అలా డల్ గా వున్నావు?' అంటూ ప్రశ్నించింది. వయసులో, చదువులో, అనుభవంలో అన్నిటా ఎంతో పైన వున్న సునీత అలా అడిగేసరికి జానకి ధైర్యం చేసి తన మనసులోని భయాన్ని బయటకు చెప్పేసింది. జానకి చెప్పిందంతా విని సునీత నవ్వుతూ, 'ఇదా నీ భయం నీ పిల్లలు నీకు చిన్నవాళ్ళుగా కనిపించవచ్చు. కానీ వాళ్లు పెద్దవాళ్ళవుతున్నారు. దాన్నే ఇక్కడ యడలెసన్ స్టేజ్ అంటారు. ఫిజికల్ గా, మెంటల్ గా వాళ్ళలో మార్పు రావడం సహజం. అది నువ్వు అర్థం చేసుకోవాలి' అంటూ చెప్పుకుపోతున్న సునీతను మధ్యలోనే ఆపుచేసి, 'కానీ... వాళ్ళు నాతో శత్రువుతో మాట్లాడినట్లు మాట్లాడుతుంటేనూ, నన్ను హేళన చేస్తూ అస్తమానం నన్ను విమర్శిస్తుంటేనూ నేను ఎలా భరించేది, వాళ్ళను ఎలా పెంచేదీ' అంటూ కన్నీళ్ళతో ప్రశ్నించింది జానకి. సునీత వెంటనే 'నీ బాధ నాకు తెలుసు జానకీ, ఎందుకంటే అది నాకూ అనుభవమే. కాని నువ్వు తల్లినని మర్చిపోయి, ఒక్క క్షణం వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. వాళ్ళు మనల్ని గౌరవించడం లేదు, మన మాట వినడం లేదు అని అనుకుంటాం. కానీ రోజూ వాళ్ళు బయట ఎన్ని అవమానాలకు, విమర్శలకు, ఛాలెంజ్ లకు గురి అవుతారో తెలుసా? వెలి వేసినట్లు ప్రత్యేకంగా కనిపించే మన పిల్లల్ని, బయట పిల్లలు ఎంత వత్తిడి చేస్తారో ఊహించగలవా? అందరు పిల్లలు చేసే పనులను చెయ్యకూడదని మన పిల్లల మీద ఆంక్షలు పెడతాం. ఇంట్లో ఒకటి చూస్తే, బయట వేరొకటి చూస్తారు. ఎదిగీ ఎదగని వయసులో వాళ్ళకు ఇదంతా అయోమయంగా అనిపిస్తుంది. మానసికంగా వాళ్ళలో ఘర్షణ మొదలవుతుంది. మనం పెరిగినట్లు మన పిల్లల్ని ఇక్కడ పెంచుదామంటే కుదరదు జానకీ. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరుగుతున్న నీ పిల్లలకు తెలిసిన ప్రపంచం ఇదే. అందుచేత వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ మనస్థత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళకు నెమ్మదిగా నచ్చచెప్పుకోవాలి. నువ్వు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్తాను. వాళ్ళు మారిపోతున్నారని బాధ పడేకంటే, ఇక్కడి పరిస్థితులకు తగినట్లుగా నీ పిల్లల్ని పెంచడానికి తల్లిగా నువ్వు మారటం ముఖ్యం అన్నది తెలుసుకో' అంటూ మృదువుగా భుజం తట్టి వెళ్లిపోయింది సునీత. సునీత చెప్పిన మాటలు జానికిని ఆలోచింప చేశాయి. జానకి నెమ్మదిగా ఇంటిని, ఇంటి పద్ధతుల్ని, తనని మార్చుకోవడం మొదలు పెట్టింది. కష్టపడి ప్రత్యేకంగా క్లాసులు కూడా తీసుకుని ఇండియన్ యాక్సెంటు లేకుండా ఇంగ్లీషు మాట్లాడగలగడం అలవాటు చేసుకుంది. పిల్లలతో మాట్లాడటానికి సినిమాలు, సంగీతం బాగా ఉపయోగపడతాయని గ్రహించిన జానకి వాళ్ళకిష్టమైన మూవీస్ గురించి, వాళ్ళు వినే మ్యూజిక్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టింది. ఇంతకు ముందులాగ పిల్లల్ని అన్నమే తినాలని బలవంతం చేయడం, తినకపోతే బాధపడడం మానుకుంది. పైపెచ్చు వాళ్ళకోసమని ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు తిరగేసి వాళ్ళ కిష్టమైన వంటలు చెయ్యడం నేర్చుకుంది. పూర్వం లాగ రేఖను ఆరునూరైనా పార్టీలకు ఇండియన్ బట్టలే వేసుకోవాలని బలవంతం చేయడం మానుకుంది. నెమ్మదిగా సునీత చెప్పిన మాటల్లో అర్థం తెలిసి రాసాగింది జానకికి. ఈ దేశంలో పిల్లలతో స్నేహంగా వుంటూ ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళలో కలిసిపోయి వాళ్ల ప్రపంచంలోకి అడుగు పెడ్తే తప్ప వాళ్ళను పెంచలేమన్న సత్యాన్ని తెలుసుకుంది. పదహారేళ్ళ వయసులో పెళ్ళి పేరిట పల్లెటూరు వదిలిన ఆ జానికి వేరు. 40 ఏళ్ళకు పైగా అమెరికాలో స్థిరపడిన ఈ జానకి వేరు. ఇన్నేళ్ళలో జానకి ఎంతో ఎత్తు ఎదిగింది. ఎన్నో ఆటుపోట్లు తింది. ఎన్నో సుఖాల్ని, వింత అనుభూతుల్ని పొందింది. అన్నింటికి మించి జానకి పరిస్థుతుల కనుగుణంగా ఎంతో మారిపోయింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ జానకికి ఇంకొకటి కూడా అర్థమయింది. పిల్లలతో కనీస సంబంధబాంధవ్యాలు నిలబెట్టుకోవాలంటే వాళ్ళననుసరించి పోతూ, వాళ్ళ ఇష్టమే తన ఇష్టంగాబావించడం తప్ప వేరే మార్గం లేదన్న నిజాన్ని తెలుసుకుంది. అందుకే వాళ్ళ చదువుల విషయంలో కానీ, ఉద్యోగవిషయాల్లో కానీ, ఆఖరికి వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కూడా జానకి ఎటువంటి అభ్యంతరం పెట్టుకోలేదు. పిల్లలు ముగ్గురూ మూడు రకాలుగా వాళ్ళకిష్టమైన వాళ్ళను చేసుకున్నారు. పెద్దవాడు విజయ్ కాలేజీలో తనతో చదువుకున్న అమెరికన్ అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి రేఖ తన ఆఫీసులో పనిచేసే పంజాబి అబ్బాయిని చేసుకుంది. చిన్నవాడు వినోద్ ఆఫ్రికాలో పుట్టి, గయానాలో పెరిగి, అమెరికాలో స్థిరపడ్డ అమ్మాయిని చేసుకున్నాడు. జానకి ఇప్పుడు గ్రాండ్ మదర్ కూడా అయిపోయింది. ఇన్నాళ్ళూ తన పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చెయ్యడంలో అలిసిపోయిన జానకి ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ని కలిసినప్పుడల్లా తనూ ఒకచిన్న పిల్ల అయి వాళ్ళతో ఆడుకుంటూ ఆనందిస్తుంది. అందరిలోకి జానకి ఊహకు భిన్నంగా పెద్దవాడి కూతురు నికోల్ జానకిని చూస్తే చాలు వదిలిపెట్టదు. నాలుగేళ్ళు నిండిన నికోల్ జానకి ఏం చేసినా కుతూహలంగా చూస్తూ యక్ష ప్రశ్నలు వేస్తూ వుంటుంది. అప్పటివరకూ తన చుట్టూ తిరుగుతున్న నికోల్ వున్నట్టుండి మాయమయ్యేసరికి జానకి గాబరాగా వెకతడం మొదలు పెట్టింది. కింద ఎక్కడా కనిపించక గబగబ పైకి వెళ్ళింది జానకి. అడుగుల చప్పుడు విన్న నికోల్ పరిగెత్తుకుంటూ జానకి దగ్గరకు వచ్చి పట్టు చీరలో, నుదుట కల్యాణం బొట్టుతో, పువ్వుల జడతో, చేతుల నిండుగా గాజులు, నగలతో తెలుగుతనానికి ప్రతీకగా వున్న జానకి ఫొటో చూపించి 'who is this gradma? shi is pretty?' అని అడిగింది. నికోల్ మనస్తత్వం తెలిసిన జానకి ఆ ఫోటో గురించి, ఆనాటి ముస్తాబు గురించి వివరంగా చెప్పింది. అంతా విన్న నికోల్ ఫోటోలో వున్న జానకి వేపు వేలు పెట్టి చూపిస్తూ 'I want to grow up and look just like her' అంది. జానకి మొహం ఒక్కసారిగా ఆనందం, ఆశ్చర్యం మిళితమైన కాంతితో వెలిగిపోయింది. నికోల్ వెంటనే తల పైకెత్తి జానకి మొహంలోకి సూటిగా చూస్తూ 'you look so different. why did you change grandama'? అంటూ అమాయకంగా ప్రశ్నించింది.
Comments
Jakayla
Articles like these put the consumer in the driver seat-very imortpant. http://neahlftuur.com [url=http://sgaqdwr.com]sgaqdwr[/url] [link=http://hloohj.com]hloohj[/link]
Adelaide
Well I guess I don\'t have to spend the weekend fiiurgng this one out!
Esther
If time is money you\'ve made me a weelthiar woman. http://enslspltja.com [url=http://sgbzdf.com]sgbzdf[/url] [link=http://uodhslmuswy.com]uodhslmuswy[/link]
Dollie
So that\'s the case? Quite a reetvalion that is.
Neveah
Holy shtznii, this is so cool thank you.