కోరిక
'సత్యా! చిత్రమైన కోరిక కోరుతున్నావు. దేవతలకి సంసారం సంతానం ఉండదు. అది కేవలం పశువులకి, మానవులకి మాత్రమే’ అంటూ ఊరడించసాగాడు గోవిందుడు ఇష్టసఖి సత్యని. సత్యభామ ఎన్నో రోజులుగా మాధవుణ్ణి తనకు సుతుణ్ణి ప్రసాదించమని వేడుకోసాగింది. ఏదో నెపంతో కాదూ కూడదూ అంటూ ఏవేవో నెపాల్ని సత్యభామకి చెప్పుకొస్తున్నాడు శ్రీకృష్ణుడు. సత్య మొండికేసింది తనకూ సంతానం కావాలని. వాడి బాల్యచేష్టల్ని చూస్తూ వేడుక చేసుకోవాలని ఆశపడ్తోంది. ససేమిరా కూడదన్నాడు మాధవుడు. బెట్టు చేసింది సత్య. సంతానమనేది ఒక మాయ అని అందులో చిక్కుకుంటే బయట పడడం కష్టమని. చివరికి తనని సైతం పట్టించుకోవని ఎంతగానో చెప్పిచూశాడు గోవిందుడు. బాబు కావాల్సిందే అని మొండికేసింది సత్య. సరే నీ ఇష్టమంటూ సంతాన ప్రాప్తి కల్గించాడు మాధవుడు. సంబరపడిపోయింది సత్యభామ. బృందావనమంతా ఆనందమయమైపోయింది. సత్య తన బాబుని తోటలు, వనాలు తిప్పి తనూ ఆనందడోలికల్లొ తేలియాడసాగింది. ఇప్పుడు సత్యకి తన బాబే ప్రపంచమైపోయింది. నివ్వెరపోసాగాడు కృష్ణుడు సత్య సంతోషాన్ని చూసి. తన ఉనికిని సైతం గుర్తించే స్థితి, స్థాయిలో లేదు సత్య. నవ్వుకున్నాడు. క్షణికమైన సంబరానికి సత్యే ఓ ఉదాహరణ అనుకున్నాడు గోవిందుడు. దినదిన ప్రవర్ధనమానమన్నట్టుగా బాబు పెరిగి పెద్ద అవుతున్నాడు. బాబుకి తనకిష్టమైన పేరు కృపుడని నామకరణం సైతం చేసింది సత్య. ఎల్లవేళలా తన బాబు పేరైన కృపనామమే జపమైంది సత్యకి. కృష్ణుడి సంగతే మరచిపోయింది. రోజులు సంవత్సరాలౌవుతున్నా తన బాబే లోకమని భావిస్తున్న సత్య లోక రక్షకుడైన కృష్ణుడిని కనీసం తలవడం కూడా లేదు. మెల్లిగా మాధవుడు దూరమవుతున్న సంగతి సైతం సత్య మరచిపోయింది.ఇహ కష్టాలు ప్రారంభం కాసాగాయి. ఇన్ని రోజులు కృష్ణుడి అండదండలు దండిగా ఉండటం వల్ల కాబోలు హాయిగా ఉన్న సత్య ఈ మధ్య బెంగపడసాగింది. తన బాబు ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, స్తబ్ధుగా, నిస్తేజంగా పడి ఉండటం భరించలేకపోతుంది. కారణాలు ఎంతగా ఆలోచించినా గోచరించడం లేదు. తన చెలికత్తెలతో విచారించింది కృపుడి అనారోగ్య పరిస్థితికి కారణమేమై ఉంటుందని. వారూ ఏమి చెప్పలేకపోయారు. ఆలోచనలో పడిపోయింది. విచారంలో తన ఆరోగ్యం సైతం దిగజారడం గమనించింది సత్య. కృపుడు రోజురోజుకీ బలహీనం కాసాగాడు. పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఠక్కున గుర్తొచ్చింది సత్యకి ఎన్నో రోజులుగా తన సఖుడైన శ్రీకృష్ణుడ్ని తన మదిలో సైతం తల్చుకోకపోవడం. ఎంతగానో బాధపడింది. కృష్ణుడు చెప్పింది తనకి మెల్లిమెల్లిగా గుర్తుకు రాసాగింది. అవునూ, తనే సంతానం కావాలని కోరింది. కాదూ కూడదని బెట్టు చేయడం, చివరికి కనికరించి సంతానాన్నిచ్చిన పతినే ఇంతవరకూ తలవకపోవడం, తనూ దూరమవుతాన్న మాట సైతం గుర్తుకొచ్చి బాధపడి ఎంతో వేదనకి గురి అయింది సత్య. ప్రేమాభిమానాలున్నవారిని నిరాదరణ చేస్తే దూరం కాక తప్పదని, తన అపోహల నుంచి దూరం కావడానికి ప్రయత్నించింది సత్య. మెల్లిగా తనను ఆవరించుకున్న మాయలు నీలినీడలు విడిపోసాగాయి. నిరంతరంగా కృష్ణుడ్ని తన మదిలో నిలుపుకోవడంతో నీలినీడల్లోంచి మందహాసంతో అరుదెంచాడు శ్రీకృష్ణుడు. అంతవరకూ అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి మారిపోయి బృందావనం నందనవనమైపోయింది. సత్య సంతోషపడింది గోవిందుడి రాకకి. అంతదాక బలహీనంగా ఉన్న కృపుడు అంతర్ధానమయ్యాడు. శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోయాడు. తన బాబుకై వెతుకుతున్న సత్యకి తన చిరునవ్వుతో సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు - 'సత్యా! మాయామోహంలో పడిన వారికి సుఖశాంతులుండవని’.