మహా బలుడు
అవంతీపురాన్ని పాలించే రాజు నరేంద్రవర్మ తన జన్మదినం సందర్భంగా ఏటా బలాఢ్యులకు పోటీలు నిర్వహించేవాడు. అలా తన 50వ పుట్టిన రోజుకి మునుపటి కన్నా ఘనంగా ఏర్పాట్లు చేశారు.
రాజ్యంలో దేహదారుఢ్యం కలిగిన పరాక్రమవంతులంతా బరిలో దిగారు. పోటీలను చూడ్డానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. వివేకుడు అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వచ్చి వీక్షకుల్లో ముందు వరుసలో కూర్చున్నాడు.
అందరూ ఆసక్తిగా చూస్తుండగా పోటీలు మొదలయ్యాయి. అందరిచూపూ కండల వీరుడు వీరయ్య మీదే. ఎందుకంటే వీరయ్య గతంలోనూ ఎన్నోమార్లు ఈ పోటీల్లో విజయం సాధించి తిరుగులేని విజేతగా పేరు తెచ్చుకున్నాడు. ఈసారి కూడా ఒక్కొక్కరినీ మట్టి కరిపిస్తూ వచ్చాడు వీరయ్య.
ఇక మిగిలింది తుది పోరు. దాంట్లో వీరయ్యతో తలపడ్డాడు శివయ్య. పోటీ హోరాహోరీగా సాగుతోంది.
ఇంతలో ప్రేక్షకుల నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. పెద్ద పెట్టున అలజడి చెలరేగింది. దానికి కారణం అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం. ప్రేక్షకులు కూర్చున్న దగ్గర ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని, డేరాలు కాలిపోసాగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఎవరికి వారు తమ ప్రాణాలు కాపాడుకోవాలని పరుగులు తీస్తున్నారు. కానీ ఆ మంటల్లో కొందరు చిన్నపిల్లలు చిక్కుకుపోయారు. వెంటనే ముందు వరుసలో ఉన్న వివేకుడు మంటల్లోకి దూకాడు. తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్లలందరినీ బయటకు తీసుకొచ్చి కాపాడాడు. వివేకుడి చొరవతో ప్రమాదం జరిగినా ప్రాణనష్టం కాలేదు. కాసేపటికే వాతావరణం మళ్లీ ప్రశాంతంగా తయారయ్యింది.
అయితే ఓ పక్క అగ్ని ప్రమాదం జరిగినా వీరయ్య, శివయ్య ఏమాత్రం తగ్గలేదు. తమ పోరు కొనసాగిస్తూనే ఉన్నారు.
నువ్వా నేనా అన్నట్టు ఒకరిపై మరొకరు పడి పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు.చివరికి పోటీలో శివయ్యను మట్టి కరిపించి వీరయ్య నెగ్గాడు.
ఇక మిగిలింది రాజుగారి చేతులమీదుగా విజేత బహుమతి అందుకోవడమే.
ఇంతలో రాజుగారు మంత్రి జలంధరుడితో ‘పోటీలో విజేత ఎవరు?’ అని అడిగారు.
‘ఇంకెవరూ ప్రభూ! ఎంతో మందిని ఓడించిన మహాబలుడు వీరయ్య మీ కళ్లముందే ఉన్నాడుగా?’ అన్నాడు.
‘లేదు ఇక్కడ అసలైన విజేత మరొకరు ఉన్నారు’ అన్నారు రాజు.
మంత్రికి ఏమీ అర్థం కాక రాజువైపు అయోమయంగా చూడసాగాడు.
రాజు వివేకుణ్ని పిలిచి ఏటా పోటీల్లో ఇచ్చేదాని కన్నా రెట్టింపు బహుమానాన్ని అతనికి ఇచ్చాడు. ‘కండలు పెంచి, పదిమందిని పడగొట్టేది బలం కాదు. జనాలు ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవాడే అసలైన బలశాలి. ఇక్కడ ఇంతమంది కండల వీరులు ఉన్నా, ఎవరూ చేయలేని పని ఈ యువకుడు చేశాడు’ అని రాజు వివేకుడిని సత్కరించాడు. తర్వాత పోటీల్లో విజేతలకు కూడా తగిన రీతిన బహుమతులు అందజేశాడు నరేంద్రవర్మ