Articles - Manchu Puulu




Name: Admin

Published Date: 06-04-2016


మంచు పూలు

ఆంటీ! ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం. మీరంతా తప్పకుండా రావాలి' అంటూ పొద్దున్నే వచ్చిన నీలిమ పిలుపు. మొన్నటికి మొన్న 'ఆంటీ! ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా! మీరొచ్చి తప్పకుండా వాయనం తీసుకోవాలి. పెద్ద వారుకదా ముందుగా మీకే ఇవ్వాలని', ఈ ఏడు మా అదృష్టం. ఇక్కడ ముత్తైదువలే దొరకరు. ఒక్కరు ఇద్దరు ఉన్నా ఆఫీసులకి వెళ్ళి పోతారు. ఇక పెద్ద వాళ్ళంటె మీలా ఎవరైనా పేరెంట్స్ వచ్చి నప్పుడే దొరుకుతారు. నేను మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒక అరగంటలో వచ్చేయండి... అంటూ ఎదురింటి రమ ఆహ్వానం . అంతేనా? అంతకు ముందు మొన్న మంగళ వారం 'ఈ రోజు శ్రావణ మంగళ వారం కదా! పొద్దున్నే పూజ చేసుకుని ఆఫీసుకి వెళ్ళి పోయాను.ఇప్పుడే వచ్చాను. నాకు పదిమంది నా ఫ్రెండుకి పదిహేను మంది ముత్తైదువలు కావాలి. మీరంతా ఇంట్లో ఉంటామంటే శనగలు అవీ తీసుకుని తాంబూలం ఇవ్వడానికి వస్తాము' అంటూ ఒక స్నేహితురాలు ఫోను చేసింది. తప్పకుండా రండి. మేమెక్కడికీ వెళ్ళము. మాచుట్టు పక్కల కూడా పదిమంది దాకా దొరుకుతారు. మా ఇంట్లోనే మా అత్తయ్యగారు, మా అక్కా నేను ముగ్గురు ఉన్నాం' అంటూ చిన్న కోడలు ఫోను పెట్టేసింది. ఇదంతా చూస్తుంటే శారదకి వింతగా అనిపించింది.ఏ...మి...టీ..? ఈ అమెరికాలో, ఇంత భారతీయత ఉట్టిపడుతోందా? ఇక్కడ కూడా ఫుజలూ, వ్రతాలు, నోములు మన సాంప్రదాయాలను విడనాడ కుండా? ?? నిజమే తను వచ్చి నప్పట్నుంచీ చూస్తోంది. చుట్టు ప్రక్కల ఏ పదిమంది ఇండియన్స్ ఉన్నా అందరు కలిసి కట్టుగా ఆడా మగా పిల్లా జెల్లా కలసి మెలసి పూజలు పార్టీలు, పిక్ నిక్లు చేసుకుంటూనే ఉన్నారు. వెనుక బ్యాక్ యార్డ్ లాన్ లో ఆటలు, డెక్ మీద పాటలు, శని ఆదివారాలు సాయంత్రాలు ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఎవరి భాష వాళ్ళు మాట్లాడు కుంటారు.తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం ఇలా. ఐతే ఇంతటి ఐకమత్యం మన దగ్గర లేదేమో అనిపిస్తుంది.ఎందుకంటే ఎదుటివాడి ఉన్నతిని చూసి ఏడవటం వాణ్ణి ఎలా పడగొట్టాలా అని ఎదురు చూడ్డం, అసూయా ద్వేషాలతో రగిలి పోవటం తప్ప మన ఇండియాలో ఏముంది? నడి రోడ్డుమీద పట్టపగలే హత్యలు, ఆత్మ హత్యలూ, దొంగతనాలు, దోపిడీలు, మాన భంగాలు. ఇంతేగా ? సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ అలాంటివేవీ ఉండవేమో అనిపిస్తుంది. పైగా ప్రతి ఇంటికీ సెక్యూరిటీ అలారం ఉంటుంది. అలారం మ్రోగితే చాలు, పోలీసులు రెక్కలు గట్టుకుని వాల్తారు. నిజానికి అర్ధ రాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగాలన్నా ఇక్కడ భయం ఉండదు.చేను మేసే కంచెలుండవు. ఇక్కడ స్త్రీ పురష బేధం లేదు. అందర్ని అందరూ బాగా చూస్తారు. ముఖ్యంగా మన భారతీయులంటే మరింత గౌరవంగా ఆడైనా మగైన చిరు నవ్వుల పలకరింపుతో 'హాయి' చెప్పి విష్ చేస్తారు. మనం ఎక్కడ మాలైనా ,బీచైనా, హోటలైన , పార్కైనా. వాకింగ్లో ఐనా ఎక్కడైనా అది వారి ఆచారం కింద చక్కగా పలకరిస్తారు. అదే మన దేశంలో దగ్గర చుట్టమైన ఎంతో పరిచయమున్న మిత్రుడైన ఇష్టం లేకపోతే ముఖం పక్కకి తిప్పుకుని వెళ్ళి పోవడం పరిపాటి. ఇక్కడ ఎవరికెవరు అపరిచితులు కారు. అందరూ అందరికీ పరిచితుల్లానె విష్ చేసుకుంటూ కదలి పోతారు. నిజం చెప్పాలంటే అమెరికాలో అడుగిడిన ప్రతి క్షణం ఒక వింత అనుభూతి. ఈ అందమైన ప్రకృతి సౌందర్యాలకా? దేశం కాని దేశం వచ్చినందుకా? ఇక్కడి ప్రజల ఆదరాభి మానాలకా? ప్చ్! ఏమో తెలియదు. ఇక్కడ అందమైన అమ్మాయిల తీరుతెన్నులు వారి జీవన విధానాలు ఈ దేశపు సంస్కృతీ సాంప్ర దాయాలు, కొన్ని ఆశ్చర్యాన్ని మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. కొందరు పిల్లల్ని పెద్దల్ని చూస్తుంటే షోకేసుల్లో బొమ్మలు వీళ్ళని చూసే చేసారా అన్నంత భ్రాంతి కలుగుతుంది. అంత అందంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లల్ని బాగా చూస్తారు. పసి తనం నుంచీ హైస్కూలు వరకు చాలవరకు ఉచిత విద్యా విధానమే. పదహారు సంవత్సర ములు రాగానే అమ్మాయిలకు 'స్వీట్ సిక్ష్టీన్' అని గ్రాండుగ ఫంక్షను చేస్తారు (మన చిన్న సైజు పెళ్ళిలాగ). తర్వాత పద్దెనిమిది వచ్చాక ముఫై రోజులలోగా ఇంట్లోంచి పంపేస్తారు. (స్వీట్ సిక్ష్టీన్ ఆఫటర్ ధర్టి డేస్) ఇంక వారి వారి ఇష్టాన్ని బట్టి వారి వారి జీవన విధానం ఉంటుంది. ఎక్కడైన రికార్డులో తల్లి పేరు మాత్రమే రాస్తారు. తల్లి దగ్గరకు వెళ్ళాలనా ముందుగా ఫోను చేసి వెళ్ళాలి మన లాగ పుట్టింట్లో వారాలు నెలలు ఉండరు. తల్లి దండ్రులే ఐనా తామే ఐన ఎవరి బోయి ఫ్రండుతో వాళ్ళు ఎవరి గర్ల్ ఫ్రండు తో వాళ్ళు స్వేచ్చగా తిరుగుతారు. ఎదురెదురు పడినా పలకరించుకుని ఎవరి దారిన వారు వెళ్ళి పోతారు. అందుకే చిన్నప్పట్నుంచీ పార్ట్ టైం జాబులు చేసి సంపాదించు కోవటం నేర్పు తారు.ఎవరి గొడవ వారిదే. స్వేచ్చా జీవులు. అందుకే ఇలాంటి దేశంలో మన ఆచారాలు అలవాట్లు వదులుకుని బ్రతకాలంటే పెద్దలకి ఇబ్బంది గానే ఉంటుంది. కాక పోతే కారణం ఏదైనా ఐన వాళ్ళందర్ని వదులుకుని కష్టపడి వచ్చిన అవకాశం సద్విని యోగం చేసుకోవాలి గనుక వృత్తి పరంగానే గాక మన చుట్టు ప్రక్కల ఉన్న భారతీయు లందరితో మన సాంప్ర దాయాలను పంచుకుంటూ, మనకి మనం స్వదేశీయానందాన్ని పొందవచ్చును. అందుకే తాము రావడమే కాకుండా తల్లి దండ్రులనీ, దగ్గర ఆత్మీయులనీ వీసాలు తెప్పించి రప్పించు కుంటున్నారు. పెద్దలకి ఈ వాతావరణం ఇక్కడి అలవాట్లు కొంచెం ఇబ్బంది కరమైన మన పిల్లల దగ్గరకే కదా అనో, దేశం చూడాలనో ఖచ్చితంగా వచ్చి వెడుతు ఉంటారు. ఇక ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో బాబా భజనలు, లలితా సహస్రాలు, వ్రతాలు పూజలు పార్టీలు అందరు కలిసి చేసుకుంటూ ఉంటారు. పెద్ద వాళ్ళు వచ్చారంటే మరింత ఎక్కువగా చేస్తారు. వేసవి కాలంలోనే చాలా మంది వస్తారు. ఎవరింటికి చుట్టాలు వచ్చిన ఎంతో ఆదరాభి మానాలతో లంచిలు, డిన్నర్లు ఏదో వంకన పార్టీలు జరిపి కానుక లిచ్చి పంపుతూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, దుర్గా మాతగుడి, బాబా గుడి ఇలా దేవాలయాలు ఉన్నాయి. పర్వదినాలలో కలిసికట్టుగా వెడుతుంటారు. అక్కడ మనం మర్చిపోతున్నా మనుకుంటున్న సంస్కృతికి ఇక్కడ హారతి పడుతున్నారు. ఎటొచ్చీ అటు భారతీయతకి ఇటు అమెరికాకి మధ్య త్రిశంకు స్వర్గం లో ఉన్న వాళ్ళు అక్కడా ఇక్కడా కూడా లేక పోలేదు. నిజానికి తల్లిదండ్రుల్ని పట్టించు కోని కొడుకులూ, అత్తమామల్ని లెక్క చేయని కోడళ్ళు ఉన్న ఈరోజుల్లో అందునా మన దేశంలో లక్షలు ఖర్చు బెట్టి ఇక్కడికి తీసుకొచ్చి దేశ దేశాల సౌందర్యాలని వింతలు విడ్డూరాలని చూబిస్తున్న కొడుకులూ వారికి అనుగుణంగా నిండు మనసుతో ఆహ్వనించి ఆదరించే కోడళ్ళు గ్రాండ్ మా, గ్రాండ్ పా అంటూ పెద్దల ప్రేమ కోసం మురిపెంగా హత్తుకు పోయే మనవలు తిరుగు ప్రయాణం రోజున బట్టలు సర్దుతుంటే గుండెలు బరువెక్కి కళ్ళల్లో నీళ్ళు తెరిగాయి. వెడుతున్నామని తెలిసి అందరు బయటికి వచ్చి చేయి ఊపుతూ 'బై ఆంటీ! మళ్ళీ తొందరగా రావాల' అంటూ బాధగా హావ భావాలు ప్రదర్శిస్తుంటే ఎన్ని సార్లు వచ్చి వెళ్ళినా మార్పు లేని ఈ మమత రాగాను రాగాలు ఈ మంచు పూల మధ్య ఇంతటి ఆహ్లాదాన్ని ఒదులుకుని ఈ బంధాలకి దూరంగా అందర్నీ దాటుకుంటూ కారు విమానాశ్రయం వైపు కదిలే సరికి గుండెల నిండా బరువు ఈ మంచు (పూలు) నింపిన బరువు.... మోయలేనంత....బరువు...అది...మెల్ల....గా.... కరగాలే....తప్ప....? ?...?



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.