Articles - Meka Telivi




Name: Admin

Published Date: 10-03-2016


మేక తెలివి

మేక తెలివి
అనగనగా ఒక ఊళ్లో ఒక మేక మంద నుంచి తప్పిపోయి అడవిలో చిక్కుకుపోయింది. మందను కలిసేందుకు దారి వెతుకుతూ నడుస్తోంది. ఇంతలో నక్క, తోడేలు జంటగా ఎదురయ్యాయి.
మేక కొమ్ములు వాడిగా కనిపించడంతో అవి రెండూ మొదట భయపడినా, తెలివిగా మసలుకొని మేకను చంపి ఆకలి తీర్చుకోవాలనుకున్నాయి.

‘తెలివి తక్కువ జంతువులకే కొమ్ములుంటాయని మా అమ్మమ్మ చెప్పేది. ఈ అడవిని పాలించే మృగరాజుకు తెలివితక్కువ జంతువులంటే చెడ్డ చిరాకు. వాటిని బతకనీయదు కూడా! నిన్ను చూస్తే జాలేస్తుంది. కొమ్ములు తొలగించి ప్రాణభిక్ష పెడతాము ఇలా రా!’ నేర్పుగా అంది నక్క.

నక్క చెప్పింది నిజమే అంటూ వంత పాడింది తోడేలు.

తనకు ప్రమాదం పొంచి ఉందని మేకకు అర్థమైంది. ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచించసాగింది. అప్పుడు దానికో ఉపాయం తట్టింది.

goat

‘నా కొమ్ములు పీకేటప్పుడు మీ పళ్లు విరిగితే మీరు ఏమీ తినలేరు కదా. మరి తర్వాత ఎలా బతుకుతారు? ఆ పాపం నాకు చుట్టుకుంటుందేమోనని ఆలోచిస్తున్నాను’ అని దీనంగా అంది మేక.

‘మా పళ్లను ఓసారి చూడు’ అంటూ నోరు చూపించాయి నక్క, తోడేలు. ఆ వాడైన పళ్లను చూడగానే మేక గుండె గుభేల్‌మంది. అయినా ఏమాత్రం భయం ప్రదర్శించకుండా ‘ఆ తుమ్మ చెట్టు కనిపిస్తోంది కదా! దాని జిగురును బాగా నమిలితే పళ్లు చాలా గట్టిపడతాయని మా అమ్మమ్మ చెప్పింది. ఆ తరువాత మీ ఇష్టం’ అంది మేక.

పంటి బలం పెంచుకోవడంలో నష్టం ఏముందనుకున్న నక్క, తోడేలు చెట్టు మొదట్లోని జిగురు ఉండల్ని నోటితో పీకి నమలసాగాయి. కొద్ది సేపటికి వాటి నోరంతా జిగురు అంటుకుపోయింది. వాటికి నోరు తెరవడమే కష్టమైపోయింది. అలా అవి పడే కుస్తీ చూసి మేక తెగ నవ్వుకుంది. అవి రెండూ జరిగింది తెలుసుకుని తెల్లమొహం వేశాయి. మేక తన వాడి కొమ్ములను చూపిస్తూ వాటిని హడల గొట్టింది. చేసేది లేక నక్క, తోడేలు భయంతో పరుగులు తీశాయి. అపాయానికి విరుగుడు ఉపాయమే అని ముందుకు వెళ్లింది మేక.




Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.