ఓ భర్త కథ
ఆఫీసుకు సూపర్నెంట్ అయిన సుబ్బారావు ప్రతీ రోజూ గంట లేటుగా రావడం గమనించిన మేనేజర్ వ్యాఘేశ్వర రావు అతనికి క్లాసు పీకాలని నిర్ణయించుకొని అతనిని ఒక రోజు ఉదయం కేబిన్ కు పిలిచాడు. `ఏమయ్యా! సుబ్బారావు? ఏమిటి సంగతి... రెండు నెలలుగా గమనిస్తున్నాను, ప్రతీ రోజూ గంట లేటుగా వస్తున్నావు. సూపర్నెంట్ అయి వుండి లేటుగా రావడానికి సిగ్గులేదూ! నిన్ను చూసి మిగతా స్టాఫ్ కూడా లేటుగా రావడం మొదలెడితే నా పరిస్థితి ఏమిటి? రేపట్నుంచి ఒక్క రోజైనా లేటుగా వచ్చావంటే చార్జి మెమొ ఇచ్చి సస్పెండు చేస్తాను జాగ్రత్త' అంటూ పెద్దవైన తన మీసాలు మెలేస్తూ పులిలా గాండ్రించాడు వ్యాఘేశ్వర రావు' `ఎప్పుడూ సాఫ్ట్ గా మాట్లాడుతూ, మీసాలు మెలెయ్యడమే తప్ప సీరియస్ గా ఉండని బాస్ ఈ రోజు మెమో, సస్పెండు అంటూ రెచ్చిపోవడం తో బిత్తర పడిపోయి కళ్ళ నీళ్ళ పర్యంతరమై ‘సార్, వయసులో పెద్దవాడిని, గంపెడు సంతానంతో సంసార సాగరాన్ని ఎంతో కష్టపడి ఈదుతున్న వాడిని, కాస్త కనికరించండి సార్, ఇటువంటి తప్పు ఇక ముందు చేయను' అంటూ కాళ్ళా వేళ్ళా పడ్డాడు సుబ్బారావు. `ఏమిటోనయ్యా మీ ఉద్యోగులు, అందితే జుత్తు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు, అది సరే గాని, ఎందుకు ప్రతీ రోజూ లేటుగా వస్తున్నావో చెప్పు' ఆసక్తిగా అడిగాడు మరొక్క సారి తన మీసాలను మెలేస్తూ వ్యాఘేశ్వర రావు. `ఏం చెప్పను సార్. నా కష్టాలు ఈ భూప్రపంచం మొత్తం మీద ఎవరికీ వుండవేమో! గవర్నమెంటు ఉద్యోగం చూపించి ఎక్కువ కట్నం వచ్చే సంబంధం చూసి మరీ పెళ్ళి చేసుకున్నాను సార్! ఆ రోజు నుండే నా కష్టాలు మొదలయ్యాయి. ప్రోద్దున్నే నాలుగు గంటలకు లేవడం, డికాషను పెట్టడం, బట్టలు వుతకడం, ఇల్లు వూడవడం, కాఫీ టిఫెన్లు, వంట పూర్తి చేసి , పిల్లగాళ్ళను నిద్ర లేపడం, వాళ్ళకు స్నానాలు చేయించి వాళ్ళ బాక్సులు సర్ధి స్కూలుకు తయారు చెయ్యడం, స్కూటర్ పై స్కూలుకు దించి రావడం, నా ఆఫీసు బాక్సు సర్ధుకోవడం లాంటి చిన్న చిన్న పన్లన్నింటినీ నేనే చెయ్యాలి.
తొమ్మిది గంటలకు మా ఆవిడ నిద్ర లేచాక, పేస్టు, బ్రష్ లను అందించడం, కాఫీ, టిఫిన్లు నోటికి ఇవ్వడం, స్నానానికి నీళ్ళు పట్టడం కూడా నేనే చెయ్యాలి సార్. అప్పుడు బయలుదేరితే కరెక్ట్ టైముకు ఆఫీసుకు చేరుకుంటాను. ఈ మధ్య నా ప్రాణానికి నా మరదలు పిల్లలతో దిగింది. ఆవిడ కూడా మా ఆవిడ టైపే. విప్పిన చీర కూడా మడత పెట్టదు. లంగాలతో సహా నేనే వుతికి ఆరెయ్యాలి. పైగా రోజుకో వెరైటీ వంటకం నేర్చుకొని చేయకపోతే వాళ్ళు అసలు మెతుకు ముట్టరు, నా బ్రతుకు బస్టాండు చేసేస్తారు. పొద్దున మూడు గంటలకు లేచినా పనులకు టైము సరిపోవడం లేదు. అందుకే ఆఫీసుకు లేటుగా వస్తున్నాను. కాస్త కనికరించండి సార్!' అంటూ మొత్తం స్టొరీ అంతా గుక్క తిప్పుకోకుండా ప్రొఫెషనల్ సినీ కధా రచయిత లాగ చెప్పుకొచ్చాడు సుబ్బారావు. మొత్తం వినేసరికి కళ్ళు తిరిగి మైండు బ్లాకయ్యినట్లనిపించింది వ్యాఘేశ్వర రావుకు. కళ్ళు, ముక్కు లను షర్టుతో తుడిచేసుకొని అమాంతం సుబ్బారావును కౌగిలించేసుకొని `ఎంతటి విషాద గాధయ్యా నీది. నీదే కాదు ఈ దేశం లో కట్నానికి కక్కూర్తి పడి బోలెడు మంచి సంబంధాలను రిజెక్ట్ చేసేసి ఆఖరుకి తనకు తగని వారిని పెళ్ళి చేసుకునే మగాళ్లందరిదీ ఇదే పరిస్థితి. కట్నం కోసం ఆశ పడినందుకు పెళ్ళయ్యాక పనిమనిషుల్లా మారిపోతారు. కానీ ఏం చేస్తాం. నీటిలో కి దూకాక ఈదక తప్పదు కదా. అలా అని పూర్తిగా మునిగిన తర్వాత తేలడానికే ప్రయత్నం చెయ్యాలి. గుండె చేత బట్టుకొని ధైర్యం గా కార్గిల్ యుద్ధం చేసిన సైనికుడలా నీ జీవిత సమరాన్ని సాగించు. బెస్టాఫ్ లక్. నీ కోసం స్పెషల్ గా ఒక గంట పర్మిషన్ ఇస్తున్నాను. కానీ నా కోసం కూడా కనీసం రెండు రోజుల కొకసారి క్యారియర్ తీసుకు రావాలి సుమా! ప్రతీ రోజూ రుచి పచీ లేని ఆ దిక్కు మాలిన తిండి తిని నా నాలిక బండ బారి పోయింది. అలాగే ప్రతీ ఆదివారం వచ్చి మా బొచ్చు కుక్కపిల్లకు షాంపూ తో శుభ్రం గా స్నానం చేయించాలి. దానికి సేవ చేయలేక చస్తున్నాను' అని కండిషన్లతో కూడిన పర్మిషన్ ఇచ్చి దీర్ఘంగా శ్వాస తీసాడు వ్యాఘేశ్వర రావు. ఇంట్లో పెళ్ళాం పిల్లలకు చేసే సేవ కాక ఈ ఆఫీసరు వెధవకు కూడా సేవ చేయాల్సి వస్తోంది. కానీ ఏం చేస్తాం. రోజు కొక గంట పర్మిషన్ కోసం ఈ పాట్లు తప్పవు కదా, బ్రతుకు జీవుడా అనుకుంటూ ఈ రోజు ఇంట్లో చేయాల్సిన పనులను నెమరు వెసుకుంటూ కేబిన్ నుండి బయటపడ్డాడు సుబ్బారావు.