పండుగ
(బోడపాటి రమేష్) ఏమండీ... పండగ దగ్గర పడుతోంది అమ్మాయిని, అల్లుణ్ణి నాలుగు రోజులు ముందుగానే రమ్మని ఉత్తరం రాయండి. ఆ చేత్తోనే మన అబ్బాయిని కూడా కోడలు, పిల్లలతో రమ్మనండి అన్నది కమలమ్మ భర్త కాంతయ్యతో. నీకంటే ముందే ఆ ఆలోచన వొచ్చిందోయ్. ఈ పాటికి వాళ్ళకు ఉత్తరాలు అందే ఉంటాయి అన్నాడాయన. పోనీలెండి నాకు చెప్పకపోయినా మంచి పని చేసారంటూ భర్తను మెచ్చుకుంది. ఉత్తరాలు అందుకున్న కూతురు, అల్లుడూ ముందుగానే వచ్చేశారు. వాళ్ళొచ్చిన కొద్ది సేపటికే కొడుకు కుటుంబం కూడా వచ్చేసింది. కుశల ప్రశ్నలు, పలకరింపులు పూర్తయ్యాయి. కమలమ్మకు కూతురి సంతానం, కొండుకు సంతానం చూసుకోటానికే సమయం సరిపోవడం లేదు. వాళ్ళు కూడా అమ్మమ్మ, నాయనమ్మ అంటూ ఆవిడవెనకాలే తిరుగుతున్నారు. అందరికీ ఒకే కంచంలో అన్నం కలిపి, ఆవిడ ముద్దలు పెడుతూంటే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అది చూస్తున్న ఆవిడ ఆనందానికి అంతులేదు. భార్య ఆనందంలో కాంతయ్య కూడా పాలు పంచుకుంటున్నాడు. వదినా మరదళ్ళయితే ఇంటి పనంతా చక్కబెట్టేస్తున్నారు. ఎలాగయినా ఈ కాలం పిల్లలు కాదు అని ఆవిడ మురిసిపోయింది. కోడలు కూడా తమలో కలిసిపోవడం ఆవిడకు సంతృప్తినిచ్చింది. ఏవండీ... చూశారా! ఇల్లెంత కళకళలాడుతుందో అందరూ ఒక్కచోట కలవడమే పండగ అన్నది భర్తతో. పండగ వెళ్ళిన తర్వాత ఒకళ్ల తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపోయి నట్టయింది. మళ్ళీ పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడ్డం ఆవిడ వంతంయింది. అడపా దడపా కూతురు కుటుంబం, కొడుకు కుటుంబంరావడం జరుగుతోంది. వాళ్ళు వచ్చినప్పుల్లా ఆవిడకు పండుగే. కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదుకదా..! ఏమండీ పండగ దగ్గరకొస్తుంది. మన పిల్లలను రమ్మని ఫోన్ చేయండి అన్నది భర్తతో ఆనవాయితీగా.. ఫోన్ చేశాను. వాళ్ళు పండగ రోజుకి వస్తామన్నారు అన్నాడాయన. అదేమిటీ... ముందుగా రావడం లేదా? అన్నది కమలమ్మ. అమ్మాయేమో అల్లుడుగారు ఏదో క్యాంపులో ఉన్నారు, ఆయన వస్తే వస్తాం అంది. అబ్బాయేమో పిల్లలకి పరీక్షలు, ముందుగా రావడం కుదరదు అన్నాడు. అంతేలే... పిల్లలు పెద్ద చదువుల్లోకి వస్తున్నారు కాద! అని సరిపెట్టుకుంది. పండగ రోజు రానే వచ్చింది. కూతురు కుటుంబం వచ్చింది, కొడుకు కుటుంబం రాలేదు. కొడుకు, కోడలు రాని వెలితి కనిపిస్తూనే ఉన్నా, తన అసంతృప్తిని బయటపడకుండా కూతురు, పిల్లలతో కాలక్షేపం చేస్తోంది ఆవిడ. అయితే... ఇదివరకురోజుల్లో కూతురు, కోడలూ ఒకేసారి రావడంతో తను కూతురుతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కోడలు అన్ని పనులూ చక్కబెడుతూండడంతో ఆవిడకు తెరిపిగా ఉండేది. ఇప్పుడేమో కోడలు రాలేదు. కూతురు కూడా పుట్టింట్లో విశ్రాంతి తీసుకోటానికొచ్చినట్లుగా ప్రవర్తిస్తూండడంతో అన్ని పనులూ తనే చేయవలసి రావడంతో ఆవిడకు అలసటగా అనిపిస్తోంది. అదేమిటమ్మా అన్నయ్యా వాళ్ళు రాలేదా అన్నకూతురితో లేదమ్మా, అన్నయ్య వాళ్ళ పిల్లలకు పరీక్షలంటమ్మా అని సమాధానం చెప్పింది. మన పిల్లలకేనా పరీక్షలు లేనిది? నేను చెప్పినా వినకుండా బయలుదేరావు అన్నాడు అల్లుడు. దానితో కూతురు చిన్నబుచ్చుకుంది. ఒక పక్క కొడుకు, కోడలు రాని వెలితితో బాధగా ఉన్నా, కూతురు కుటుంబం రావడంతో సర్ది చెప్పుకుని పోనీలే మీరయినా వచ్చారు అంటూ మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. అమ్మా... పండక్కి ఏం చేసుకుందామే అన్న కూతురు మాటలకి కమలమ్మ చెప్పిన వంటకాలు నచ్చక అమ్మా ఇవ్నీ మీ అల్లుడుగారు తినరే అంది. చివరకు భర్తకు ఇష్టమైన వంటకాల వివరాలు చెప్పింది. కానీ అవి తయారుచేయడంలో తల్లికి కొంచెం కూడా సాయం చేయలేదు. పైగా అమ్మా ఆయనకు ఆవిధంగా చేస్తే నచ్చదు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ తల్లికి పనిభారం పెంచింది. ఆ చిరాకులో ఏమిటే... ఇవన్నీ కొత్తగా ఎక్కడ నేర్చుకున్నావు? అంటూ కసురుకుంది కూడా. తర్వాత అయ్యో పాపం అనవసరంగా నోరు చేసుకున్నానే అని బాధపడింది. ఇంకొక పండగకి కొడుకు కుటుంబం వచ్చింది. పోనీలే నాయనా. ఈ పండక్కయినా వచ్చారు అంటూ కొడుకుని మెచ్చుకుంది కమలమ్మ. ప్రతి పండక్కీ రావడం ఎట్లాగమ్మా అన్నాడు కొడుకు వస్తూనే. తల్లి మనసు చివుక్కుమంది. అదేమిట్రా అట్లా అంటావు. మేమున్నంతవరకే కదా ఈ రాకపోకలూ అంటూ కొడుక్కి సర్ది చెప్పింది. మనవడు, మనవరాలు వచ్చినా ఆవిడ దగ్గరకు రావడం లేదు. ఉన్నన్ని రోజులూ టి.వి.చూస్తూ గడుపుతున్నారు. ఏం చదువుతున్నార్రా అన్న తన ప్రశ్నకు కూడా వాళ్ల దగ్గర నుండి సమాధానం రాలేదు. అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. కోడల్లో కూడా మార్పు వచ్చింది. ఇది వరకు అయితే తనను ఏ పనీ చేయనివ్వకుండా ఉన్నన్ని రోజులూ కలివిడిగా తిరుగుతూ అన్ని పనులూ కల్పించుకుని చేసేది. కానీ ఇప్పుడు తను కూడా పిల్లలతో పాటు టీ.వీ చూడ్డం, వాళ్ళతో కాలక్షేపం చేయడంతోనే సరిపోయింది. కోడలు తీరు చూసిన కమలమ్మకు అసహనం ఎక్కువయింది. ఫలహారాలు, భోజనాలు కూడా వాళ్ళున్న చోటికే తీసుకెళ్ళి అందించాల్సిన పరిస్థితి వచ్చింది. సహజంగానే ఆవిడకు చిరాకు అనిపించింది. ఇవన్నీ చూస్తున్న కొడుకు భార్యని మందలించే ప్రయత్నం చేయకపోడవం ఆవిడను నిస్పృహకు గురి చేసింది. 'ఉత్త వాజమ్మ' అంటూ కొడుక్కి బిరుదిచ్చేసింది... అక్కసుగా. మళ్ళీ పండగ రోజులు దగ్గర పడ్డాయి. ఈ సారి పండక్కి పిల్లుద్దామా అన్నాడు కాంతయ్య భార్యతో. కమలమ్మ నుంచి సమాధానం రాలేదు. ఏమయింది? ప్రతిసారీ పండక్కి పిల్లలను పిలవమని నువ్వే తొందర చేస్తావు కదా...? అన్నాడాయన. ప్రతి పండక్కీ రావడానికి వాళ్ళకు కుదరద్దూ అన్నదావిడ భర్తకు సర్థి చెపుతూ. అవునన్నట్లుగా ఆయన ఊరుకున్నాడు. కానీ... కమలమ్మకు తను పండగ రోజుల్లో పడే శ్రమ గుర్తుకొచ్చింది. ఇదివరకు రోజుల్లో అందరూ కలిస్తే పండగ. కానీ ఇప్పుడు ఎవరూ రాకుండా ఉంటేనే పండగ అనుకుంది. అయితే ఈ మాటలు ఎవరితోనూ అనదు. 'ఎంతయినా తల్లి కదా '