పెద్దల మాట
అనగనగా ఒక అడవి. అందులో పెద్ద చెరువు. ఆ చెరువులో ఒక తాబేలు ఉండేది. దానితో జలచరాలన్నీ స్నేహంగా ఉండేవి.
తాబేలు నివాసం నీళ్లలోనే అయినా సాయంకాలం అది అడవిలో సరదాగా షికారుకు బయలుదేరేది. మళ్లీ రాత్రి తిరిగి చెరువులోకి వెళ్లేది.
ఇది గమనిస్తున్న ఒక పీత తాబేలుతో ‘మామా! నేను కూడా నీతోపాటు షికారుకు వస్తా. నీళ్లలోనే ఉంటే విసుగ్గా అనిపిస్తోంది’ అన్నది.
‘అల్లుడూ! నా సంగతి వేరు. అడవిలో క్రూర జంతువులు ఉంటాయి. అవి ఆహారం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటాయి. వాటితో నీ ప్రాణాలకే ప్రమాదం. నన్ను నేనైతే రక్షించుకోగలను’ అని వివరించింది.
పీతకు తాబేలు సలహా నచ్చలేదు. ‘నాదెంత శరీరం. నన్ను వేటాడి తినాలని ఏ జంతువు అనుకుంటుంది? ఏం కాదులే! నేను నీతోపాటు వస్తా’ అని బయలుదేరింది.
తాబేలు, పీత కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాయి. ఒక నక్క ఇద్దరినీ చూసి పరుగెత్తుకొచ్చింది. మొదట పీత పనిపట్టబోయింది. ఇంతలో తాబేలు ‘ఆగు నక్క బావా! పీతను తినేముందు ఒక విషయం చెబుతా. తర్వాత నీ ఇష్టం’ అంది.
‘ఏం ఎందుకు ఆగాలి?’ అడిగింది నక్క.
ఈ పీతకు ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. పసరు మందు పెట్టించడానికి అడవికి తీసుకొస్తున్నా. దీన్ని తిన్నావంటే నీ ప్రాణం పోవడం ఖాయం’ అని భయపెట్టింది తాబేలు.
ఆ మాటలు నమ్మిన నక్క ‘అయితే నిన్ను తినేస్తా!’ అంటూ తాబేలుపై పడబోయింది. తాబేలు డిప్పలోకి ముడుచుకుని తనను తాను రక్షించుకుంది.
ఇంతలో ‘బతుకు జీవుడా’ అంటూ పీత అక్కడున్న చిన్న బొరియలోకి దూరి ప్రాణాలు కాపాడుకుంది.
చీకటి పడ్డాక మెల్లగా చెరువులోకి వెళ్లి ‘హమ్మయ్య బతికిపోయానురా దేవుడా!’ అనుకుంది.
పెద్దలు చెప్పిన మాటలు వినకపోతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అప్పుడు పీతకు అర్థమయ్యింది.