Articles - Raithakka




Name: Admin

Published Date: 06-04-2016


రైతక్క

(పి. అశోక్ కుమార్) ... నేను రైతునే గానా అంటూ బేంకు మేనింజర్ ను నిలదీసింది పద్మ.'అట్లగాదు. మీ ఆయనను రమ్మను. దీనికో పద్దతుంటది' విసుగ్గా అన్నాడు మేనింజర్. ఎనుక శాంతాడంత లైను. అందరూ తననే చూస్తున్నారు. మేనింజర్ మాటలకు ఎవరో కిసుక్కుమని నవ్వినట్టున్నారు. ఆ నవ్వులు, చూపులు, మాటలు ఒక లెక్కగాదు పద్మకు. ఎన్నడో బండబారిపోయింది ఆమె మనసు. కొద్దిగా బాధ కలిగినా తమాయించుకుని అదే సమాధానం చెప్పింది. మేనింజర్ మరింత విసుగుగా 'పోవమ్మా...పో... నీకు ఇయ్యంపో... ఇవి రైతులకిచ్చే క్రాప్ లోన్లు. పాస్ బుక్కులు గావాలె. నీకు లోను గావాలంటే మీ స్వశక్తి గ్రూపుల తీసుకో...' అన్నాడు. పద్మ నీరసంగా వచ్చి బేంచి మీద కూర్చుంది. కౌంటర్లో ఒక్కొక్కరు పేర్లు రాయించుకుంటున్నారు. అందరి చేతుల్లో పాస్ బుక్ లు. ప్లాస్టిక్ సంచుల్లో మలిచి అపురూపంగా పట్టుకున్నారు. వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరిగిన అలసట అందరి మొఖాల్లో కనిపిస్తుంది. మేనింజర్ కు మాత్రం కోపంగా ఉంది. వీళ్ళందరూ అలుక జనాలని అప్పులు ఇస్తే రికవరీ కావని అతడి నమ్మకం. ఎమ్మెల్యే మీటింగ్ ఊర్లోనే ఉన్నదని కుదురుగా కూసున్నడు గాని లేకుంటే ఏదో వంక పెట్టి ఇంకోవారం తిప్పుకునేవాడే. పద్మ వచ్చీపోయే వాళ్ళను దిగులుగా చూసింది. ఎల్లం బ్యాంకులో అటెండర్. ఇంటి పక్కనే ఉంటాడు. సైగచేసి పిలిచింది పద్మ. మందిని పాపుకుంటూ పద్మ దగ్గరికి వచ్చి 'నేను మొన్ననే చెప్పలేదా అక్కా... ఇవి క్రాప్ లోన్లు. నీకు ఇయ్యరని....' అన్నాడు ఎల్లం. పద్మ కండ్లల్ల నీళ్ళు తిరిగినయి. ఏదో చెప్పుదామనుకుంది. పెదవులు వణికినయి. బాధను దిగమింగుకుంది. కొద్దిగా తమాయించుకుని నవ్వుతూ 'ఇయ్యకపోతే ఇయ్యకపోయిరి. పుణ్యానికిత్తండ్రా... అన్న' అన్నది.పద్మ కష్టాలన్నీ ఎల్లంకు తెలుసు. ఇంతకుముందే మేనింజర్ కు చెప్పి చూసిండు. అతడు కుదరనే కుదరదన్నాడు. ఆమెకు ధైర్యం చెప్పుతూ 'సూడక్కా... నీకు పర్సనల్ లోన్ ఇప్పిస్త తియ్యి. దానికి దీనికి కొద్దిగ తేడా... అంతే! సబ్సిడీ ఉండది' అన్నాడు. పద్మ అప్పటికి పూర్తిగా తేరుకుంది. ఎల్లం దిక్కు నీరసంగా చూస్తూ 'వద్దు... నాకు ఏ లోను వద్దు. ఇస్తే అదే లోను ఇయ్యిమను...' ఆమె పూర్తిగా చెప్పకముందే ఎల్లం యాష్టగా 'ఆ లోన్లు నీకు ఇయ్యరంటే ఇనత్త లేదా...? అవి రైతులకిచ్చే లోన్లు' అన్నాడు. అతడి మాటల్లో కోపం కంటే ఎక్కువ సాధికారత ఉంది. ఆమెను ఆదుకోవాలన్న ఆరాటం ఉంది. పద్మ ఇవేమీ గుర్తించలేదు. అతడు ఎలా అన్నా ఆ మాటలు మాత్రం ఆమెను నిలదీసినయి. ఎన్నో రోజులుగా మసులుతున్న ప్రశ్నను గట్టిగా అడిగింది. 'అంటే... ఎల్లమూ.... నేను రైతునే గానా..?' ఈ ప్రశ్న ఒక ఎల్లంనేగాదు. అందరినీ నిలదీసి అడిగినట్లుగా అడిగింది. అడగడం గట్టిగానే అడిగినా ఆబొబ్బలో అందరికీ వినిపించలేదు. విన్న వాళ్ళు మాత్రం అనేకరకాల చూపులతో పద్మను చూశారు. ఎల్లం మాత్రం పక్కర పక్కర నవ్వాడు. నవ్వుతూ 'రైతులంటే ఆడోళ్ళు గాదు. మొగోళ్ళు... మొగోళ్ళను రైతులంటారు...' అని మళ్ళా నవ్వాడు. తెలియని విషయమేదో తెలియజెప్పుతున్నట్టే అన్నాడు గాని ఆమె ప్రశ్నించినలోతు, ప్రశ్నలోని ఆవేదన ఎల్లంకు అందలేదు. అట్లనే నవ్వుతున్నాడు. బాధగా చూసింది పద్మ. ఒక్కసారిగా కార్యాలు కదిలినయి. యాడాది కింద ఇదే బేంకులో మేనింజర్ ఎడ్లుబండి ఎల్.టి.లోన్ కొరకు వస్తే 'నువ్వు నాగలి దున్నుతావా...? బండి కడుతావా...? ఎడ్లు బండి నీకెందుకు...?' అని ఇట్లనే నవ్వాడు. అప్పుడు కూడా కడుపుల కార్యాలు కదిలినయి. మనసు బెక్కుమన్నది. లేచి ఇంటిమొఖం పట్టింది పద్మ. విసురుగా వెళ్ళిపోతున్న పద్మవైపు కోపంగా చూసాడు ఎల్లం. 'ఏదో ఒకలోను. ఏదైతే ఏంటిది. ఇప్పియ్యి' అంటుందనుకున్నాడు. ఆమె వద్దనేసరికి అహం దెబ్బతిన్నది. 'చిన్న నీలుగు నీలిగుడుగాదు. అందులేం లేదు.. సందెడు గోషి అన్నట్లు చెరువు అలిగి చెయ్యి కడుక్కోకపోతే ఎలవదేం పోతుంది' అంటూ పనిలో మునిగిపోయాడు ఎల్లం. నడుత్తుంటే కాళ్ళు వణుకుతున్నయి పద్మకు. లోను ఇవ్వనందుకు కాదు. తనను రైతే కాదన్నందుకు బాధగా ఉంది. ఈ బాధ ఇప్పుడు గాదు. ఇరువై ఏండ్ల కిందనే మొదలయింది. తవ్వంత పిల్లలుంటే తల్లికాసర. కానీ తను తండ్రి కాసరయింది. తండ్రిది ఒంటిరెక్క పాణం. తను ఒక్కతే సంతానం. పొద్దుపొడవక ముందే తండ్రితో చేనులో ఉండేది. తండ్రిని ఒడ్డుమీద కూసోబెట్టి నాగలి దున్నేది. ఒకనాడు 'నాగలి ఎత్తుకపోయి నాయినకు ఇచ్చివత్తనంటే' తల్లి కోపంగా 'ఆడ పిల్లవు నడీ ఊర్లె నుంచి నాగలి మొత్తావు' అన్నది. అది ఇది అని అప్పుడు తెలువకపోయినా ఏదో దిక్కార భావమే కలిగింది. ఆ కోపంతోనే మట్టుపార అందుకుని వంగి ఎకురం చేను ఒడ్డు ఒరాలను చెక్కిపూసింది. ఎద్దు ఎవసాన్ని తన చేతుల మీద నడిపింది. అదేం కిస్మతో గాని దొరికిన భర్త ఒంటిరెక్క పాణమే. ఎంట నిలవడితే గాని ఎడ్ల బండి కట్టేవాడు గాదు. తను నొగలు వట్టి లావడితేనే భర్త ఎడ్లమెడల మీద కాని కట్టేవాడు. బండి ఎనుక ఉండి అలుపటి దాపటి ఎడ్లను కలిపి దమాయించితేనే పని నడిచేది. భర్తకు రెండు వరికట్టలు ఎత్తి తను నాలుగు కట్టలు ఎత్తుకునేది. ఉన్నడా అంటే ఉన్నడు అన్నట్లు భర్తను ముందు నడిపి ఎనుకపట్టున తను అన్ని చూసుకునేది. నాగలిగట్టి భర్త చేతికిచ్చి నాలుగు సాళ్ళు తిరిగేలోపు సగం మడిని పారతో తవ్వుకునేది. వరికోతల మీదనైతే నిద్రనే ఉండేదిగాదు. భర్తను నిద్రపొమ్మని తను మాత్రం వడ్లకట్టలను కొట్టేది. కట్టలన్నీ కొట్టి వడ్లరాశి చేసినంక నిద్రలేచిన భర్త 'వడ్లరాశికి పొత్తి చుట్టాలె. ఆడిది చుడితే అడుగువడుతది. మొగోడు చుడితే మొగులు ముడుతది. జరుగు జరుగు' అని తనను పక్కకు తరిమి బూడిద పొత్తి చుట్టినప్పుడు రాత్రంతా రాని నీరసం వచ్చేంది. ఊర్లు పక్కచేన్ల హైబ్రిడ్ మక్క అలికిన్నాడు నడీమడిల గోరికట్టుకుంది. మొక్క మొక్కను పోదన జేసి కంకి కంకిని కంటికి రెప్ప లెక్క కాపాడింది. మంచి పంట పండిందని మండలం సార్లు మాత్రం భర్తనే ఉత్తమరైతుగా గుర్తించారు. ఆనాడు తనాలో తానే నవ్వుకుంది. కరువు పడ్డప్పుడు కైకిలి పోతే 'పద్మా... ఇద్దరు మొగోళ్ల పని జేత్తవు. నీ మొగడున్నడు వట్టి సావుబతుకులోడు. ఆడిదాని కంటె అద్వాన్నం' అని సగం కైకిలే చేతులపెట్టారు. ఆనాడు గుడ్ల నీళ్ళు గుడ్లల్ల కుక్కుకుంది. సబ్సిడీ ఇత్తనాలు ఇత్తున్నారని వెళ్తే తిప్పి పంపించినప్పుడు వచ్చి భర్తకు చెప్పితే 'ఔ... మరి రైతంటే నేనే. నన్నే రైతంటారు. నువ్వు రైతు వెట్యయితవు. నీ పేరు మీద ఎట్ల ఇత్తరు' అన్నప్పుడు మాత్రం కోపం వచ్చింది. మంటరమంట పంచాది ఆఫీసు ముందుకు పోయి అధికారులందరినీ కడిగిపోసింది. తన శ్రమను గుర్తించని నాడు కోపం రాలేదు. శ్రమను దోపిడీ చేసిన నాడు కూడా కోపం రాలేదు. సాంఘీక అసమానతలేమిటో తెలియకపోయినా తనను రైతుగా గుర్తించకపోయేసరికి మాత్రం కడుపు మసిలి పని మానేసింది. అంతే! ఎద్దు ఎవుసం మూలకు పడింది. మళ్ళీ తనే మనసు నింపుకుని ముల్లుగట్టి చేత పట్టేదాకా పని సాగలేదు. మంచె మీద పాము కరిచి భర్త కన్నుమూసిననాడు ఎద్దు ఎవుసం మూలకు పడ్డట్టే అనుకున్నారంత. అప్పుడు తను ఆరు నెలల బాలింత. పుట్టెడు దు:ఖాన్ని మింగుకుని కొంగు నడుముకు చుట్టుకుంది. సాలులో సాలు కలిపింది. నారు పీకి నాటేసి పక్కవాళ్ళ కంటే ముందుగనే గడ్డకెక్కింది. 'పద్మ మొగరాజిగాడు. ఏ మొగోడు దాని మీద పనిజెయ్యడు. అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటె కోపమచ్చేది. శ్రమలో కూడా ఆడ, మగను వేరు చేసి పోల్చిచూపుడు ఎందుకన్న ప్రశ్న కలిగేది.' అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రూపంలో ఆ ప్రశ్న పుడుతూనే ఉంది. ఆ మాటలంటున్న అధికారులందరినీ నిలదీసి తిడుతూనే ఉంది. నడుస్తూ నడుస్తూ టక్కున ఆగిపోయింది పద్మ. పక్క సందులోంచి అరుపులు. నెల కిందనే ఆ సందులో శవం లేచింది. అన్నీ తానై కుటుంబ బరువును మోసిన నర్సవ్వ అప్పుల బాదకు పరుగు మందు తాగింది. అరుపులు విని అటు దిక్కు నడిచింది పద్మ. నర్సవ్వ ఇంటిముందు గుంపుగా జనం. 'ఎక్స్ గ్రేషియా ఇయ్యాలె... ఎందుకియ్యరు...?' కార్యదర్శిని ఎవరో నిలదీస్తున్నారు. 'ఎట్లిత్తరయ్యా... నీకు కొన తెలువది. మొదలు తెలువది. ఎక్స్ గ్రేషియా ఎవలకిత్తరు...?' ఎవలు సచ్చిపోతే ఇత్తరు...? నోటికచ్చింది మాట్లాడుతరు. అందరూ లీడర్లే... తెలువది పీకది మాట్లాడుతారు. కార్యదర్శి కోపంగా అంటున్నాడు. ఎవరూ నోరు తెరుస్తలేరు. ఎంట ఎమ్మార్వో, ఆరై, ఇంకో ఇద్దరు ముగ్గురు అధికార్లున్నారు. పద్మకు పెయ్యి పొంట ముండ్లచ్చినయి. పెయ్యి జిలజిలమంది. చివరికి ఇది సావులో గూడా రైతు గాకుండా పోయింది అనుకుంది పద్మ. ఆపద్భందు పథకం కింద రాసుకో. బియ్యమిద్దాం... ఎమ్మార్వో అన్నాడు. నర్సవ్వ భర్త బొందయ్య నెత్తికి చేతులు పెట్టుకున్నాడు. భార్య ఉన్ననాడు పెట్టింది తని, చెప్పింది చేశాడు. ఇప్పుడు ఎద్దు ఎవుసం మూలకు పడ్డది. బొందయ్య బతుకు కొత్తకుండలో ఈగ జొచ్చినట్టయింది. భార్య ఎద్దు ఎవుసాన్ని ఎట్ల నెత్తినెత్తుకున్నది తెలుసు. ఎట్ల ఎల్లదీసిందీ తెలుసు. తనను ఎట్ల ముందుకు నడిపిందీ తెలుసు. తన భార్య రైతేనని ఒక్కమాట చెప్పలేకపోతున్నాడు. కార్యదర్శి ఏదో రాసుకుంటున్నాడు. ఊరిలో మీటింగ్ హడావుడి కనిపిస్తుంది. ఎవరి ఆగంలో వాళ్ళున్నారు. మైకులో పల్లెబాట పాటలు వినిపిస్తున్నాయి. అక్కడి నుండి ముందుకు కదిలింది పద్మ. కదులుతుంటే నర్సవ్వనే కండ్లల్ల కదిలింది. అప్పుడప్పుడూ తనకు ధైర్యం చెప్పేది. తను మాత్రం ధైర్యం చెడింది. బాధలు మోసింది, బరువు మోసింది. ఆ బరువులు తలకుమించినాక తట్టుకోలేక కండ్లు మూసింది. ఆలోచిస్తూనే నడుస్తున్న పద్మ మూడు తొవ్వల వద్దకుచేరుకుంది. అక్కడనే సభ. జనం పలుచగానే ఉన్నారు. ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. మీటింగ్ మొదలయింది. ముందుకు వెళ్లి నిలబడింది పద్మ. అరుపులు విని అటు దిక్కు నడిచింది పద్మ. నర్సవ్వ ఇంటిముందు గుంపుగా జనం. 'ఎక్స్ గ్రేషియా ఇయ్యాలె... ఎందుకియ్యరు...?' కార్యదర్శిని ఎవరో నిలదీస్తున్నారు. 'ఎట్లిత్తరయ్యా... నీకు కొన తెలువది. మొదలు తెలువది. ఎక్స్ గ్రేషియా ఎవలకిత్తరు...?' ఎవలు సచ్చిపోతే ఇత్తరు...? నోటికచ్చింది మాట్లాడుతరు. అందరూ లీడర్లే... తెలువది పీకది మాట్లాడుతారు. కార్యదర్శి కోపంగా అంటున్నాడు. ఎవరూ నోరు తెరుస్తలేరు. ఎంట ఎమ్మార్వో, ఆరై, ఇంకో ఇద్దరు ముగ్గురు అధికార్లున్నారు. పద్మకు పెయ్యి పొంట ముండ్లచ్చినయి. పెయ్యి జిలజిలమంది. చివరికి ఇది సావులో గూడా రైతు గాకుండా పోయింది అనుకుంది పద్మ. ఆపద్భందు పథకం కింద రాసుకో. బియ్యమిద్దాం... ఎమ్మార్వో అన్నాడు. నర్సవ్వ భర్త బొందయ్య నెత్తికి చేతులు పెట్టుకున్నాడు. భార్య ఉన్ననాడు పెట్టింది తని, చెప్పింది చేశాడు. ఇప్పుడు ఎద్దు ఎవుసం మూలకు పడ్డది. బొందయ్య బతుకు కొత్తకుండలో ఈగ జొచ్చినట్టయింది. భార్య ఎద్దు ఎవుసాన్ని ఎట్ల నెత్తినెత్తుకున్నది తెలుసు. ఎట్ల ఎల్లదీసిందీ తెలుసు. తనను ఎట్ల ముందుకు నడిపిందీ తెలుసు. తన భార్య రైతేనని ఒక్కమాట చెప్పలేకపోతున్నాడు. కార్యదర్శి ఏదో రాసుకుంటున్నాడు. ఊరిలో మీటింగ్ హడావుడి కనిపిస్తుంది. ఎవరి ఆగంలో వాళ్ళున్నారు. మైకులో పల్లెబాట పాటలు వినిపిస్తున్నాయి. అక్కడి నుండి ముందుకు కదిలింది పద్మ. కదులుతుంటే నర్సవ్వనే కండ్లల్ల కదిలింది. అప్పుడప్పుడూ తనకు ధైర్యం చెప్పేది. తను మాత్రం ధైర్యం చెడింది. బాధలు మోసింది, బరువు మోసింది. ఆ బరువులు తలకుమించినాక తట్టుకోలేక కండ్లు మూసింది. ఆలోచిస్తూనే నడుస్తున్న పద్మ మూడు తొవ్వల వద్దకుచేరుకుంది. అక్కడనే సభ. జనం పలుచగానే ఉన్నారు. ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. మీటింగ్ మొదలయింది. ముందుకు వెళ్లి నిలబడింది పద్మ.



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.