సరస్వతి మందిరం
అనగనగా బొన్దపల్లి గ్రామ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పావన మూర్తి కొత్తగా వచ్చారు. అనతికాలంలోనే గ్రామ ప్రజల మన్ననలు పొందారు.
ఆ వూళ్లో అన్ని సౌకర్యాలు ఉన్నా ఒక లోపం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వచ్చింది. వెంటనే గ్రామ పెద్దలను కలుసుకుని సమావేశం ఏర్పాటు చేశారు మాష్టారు.
‘వూళ్లో ఒక సరస్వతి మందిరం కడితే బాగుంటుంది’ అన్నారు పావనమూర్తి. దానికి అంతా ఒప్పుకున్నారు.
‘ఈ ఆలయం నిర్మాణ బాధ్యత నేనే చూసుకుంటా, పూర్తయ్యే వరకు ఎవరూ దాన్ని చూడవద్దు’ అన్నారు మాష్టారు.
ఆ షరతుకు అందరూ ఒప్పుకున్నారు. సరస్వతి మందిరం పనులు మొదలయ్యాయి. చుట్టూ డేరాలు కట్టడంతో లోపల ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. రాత్రింబవళ్లు మాష్టారు దగ్గరుండి పనులు చూసుకున్నారు. నిర్మాణానికి గ్రామస్థులంతా ఎవరికి తోచిన విరాళం వారు ఇచ్చారు.
కొన్ని నెలల్లోనే పనులు పూర్తయ్యాయి. ఒకానొక శుభ ముహూర్తాన పావనమూర్తి గ్రామ పెద్దలను, ప్రజలను ఆహ్వానించారు.
అప్పుడు సరస్వతీ మందిరం చుట్టూ ఉన్న పరదాలు తొలగించారు. ఆ మందిరాన్ని చూస్తూనే ప్రజలంతా విస్తుపోయారు. వారి కళ్లముందు వారు వూహించని సరస్వతీ మందిరం ఉంది. అదొక గ్రంథాలయం.
అప్పుడు మాష్టారి కంఠం వినిపించింది. ‘మీరంతా నన్ను క్షమించాలి. మన వూళ్లో అన్ని సౌకర్యాలు ఉన్నా, గ్రంథాలయం లోటు కనిపించింది. పుస్తకాలు చదవాలని అభిలాష ఉన్న విద్యార్థులు, యువకులు అవి అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో పుస్తకాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కానీ గ్రంథాలయం కడతామంటే ఎవరూ విరాళాలు ఇవ్వరు. అందుకే మందిరం అని చెప్పాల్సి వచ్చింది. నిజానికి ఇది కూడా సరస్వతి గుడి లాంటిదే’ అన్నారు పావనమూర్తి.
గ్రామ ప్రజలు కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత గ్రామాధికారి మాష్టారితో ‘ఇలా మమ్మల్ని మోసం చేసినందుకు మీకు తప్పకుండా శిక్ష విధించాల్సిందే. అయితే అదేంటంటే ఇక నుంచి ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలతోపాటు గ్రంథాలయం బాధ్యతలు కూడా మీరే తీసుకోవాలి’ అన్నారు.
ఆ మాటలకు జనమంతా చప్పట్లు కొట్టారు.