సేద
కురుక్షేత్ర సంగ్రామం.... నాల్గో రోజు సాయంకాలం కావడంతో వివిధ రూపాల్లో ఉన్న శంఖువుల్ని పూరించి, రథాలకున్న జండాల్ని అవనతం జేశారు ఆ రోజుకి యుద్దాన్ని ముగిస్తున్నట్టుగా. మాధవుడు, అర్జునుడు యుద్ధానికి విరామం పలికి తమకు కేటాయించిన గుడారాల్లోకి వెళ్ళిపోయారు. కాసేపటికి మెల్లిగా గోవిందుడు బైటకొచ్చి చుట్టూ చూశాడు. అలసిపోయిన సేన, అశ్వాలు, గజాలు డస్సిపోయి ఉన్నాయి. తన అరచేతిన నవనీతాన్ని తెచ్చుకుని గాయపడిన అశ్వరాజాలకి సేదనని అందజేస్తున్నాడు. ఆశ్చర్యఫోసాగాయి పశుగణమంతా. ఒక్కసారిగా లేచి నిలబడ్డాయి అశ్వగణాలు. మాధవుడి స్పర్శతో డస్సిపోయిన తమలో ఏదో తెలియని చైతన్యం చేకూరినట్టనిపించింది. కొన్ని వందల వేల పశువులకు అదే పనిగా తన సేవని అందిస్తున్నాడు గోవిందుడు. ఈ రమణీయ చిత్రాన్ని అపురూపంగా తిలకిస్తున్నారు దూరంగా ఉన్న నకుల సహదేవులు. వారు సైతం అశ్వరాజాలకి తమవంతు సహాయంగా సేవ చేస్తున్నారు గాయలకి చికిత్స నిర్వహిస్తూ. అదేం చిత్రమో ఎక్కడ చూసినా గాయపడ్డ అశ్వం దగ్గర బాలుని వోలె తన అరచేతిలోని నవనీతాన్ని గాయంపై పూస్తూ ఉన్నాడు గోవిందుడు. ఇంతలో సహదేవుడు మాధవుణ్ణి చేరుకుని, బావా! ఇంత రాత్రి అలసిపోయిన మీరు ఇలా పశుగణానికి సేవ చేయ తగునా అని అనగానే... మాధవుడు చిన్నగా నవ్వుకుంటూ, బావా! ఇందులో నేను చేసేదేముంది. గాయపడ్డ పశువుల్ని సేద దీర్చాలని అనుకున్నాను. అదే చేస్తున్నాను. అవునూ, మీరేంటి ఇలా తిరుగుతున్నారు రణరంగంలో, రాత్రి వేళ మంచిది కాదు ఇలా తిరగడం. వెళ్ళండంటూ వారిద్దరినీ పంపించేసి తను మాత్రం పశుసేవలో రాత్రంతా మునిగిపోయాడు గోవిందుడు.